ఐదుగురు పిల్లల దత్తత.. మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం

by Ramesh Naini |   (  Updated:2026-05-17 12:05:49  IST  )

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవలో సరికొత్త అడుగు వేశారు.

ఐదుగురు పిల్లల దత్తత.. మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవలో సరికొత్త అడుగు వేశారు. తన సతీమణి భూమా మౌనిక రెడ్డితో కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ (AIKYA) పేరిట ఒక కొత్త సేవా సంస్థను (ట్రస్ట్) ప్రారంభించారు. ఆదివారం కేపీహెచ్‌బీ (KPHB)లో అభిమానులు ఘనంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మనోజ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ నూతన ట్రస్ట్ పేరును అధికారికంగా ప్రకటించారు.

ఐదుగురు పిల్లల దత్తత..

సామాజిక బాధ్యతగా సమాజానికి తన వంతు సేవ చేయాలన్న సంకల్పంతో మనోజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ప్రారంభించిన తొలి రోజే, మొదటి అడుగుగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు మనోజ్ ప్రకటించారు. వారి విద్యాభ్యాస బాధ్యతలను పూర్తిగా తానే వహిస్తానని స్పష్టం చేశారు. తమ సేవా కార్యక్రమాలు కేవలం ఇక్కడికే పరిమితం కావని, ప్రతి పట్టణంలోనూ వీటిని విస్తరిస్తామని ఆయన తెలిపారు.

ఇది రాజకీయాల కోసం కాదు: మంచు మనోజ్

ఈ సేవా కార్యక్రమాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ముందే, నేను, నా భార్య మౌనిక సేవా కార్యక్రమాలతో ప్రారంభించాలనుకున్నాము. జీవిత ప్రయాణంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, అంతిమంగా మానవత్వం, మనకు అండగా నిలిచే మనుషులే ముఖ్యమని తెలుసుకున్నాం. ఈ సేవాభావం మాలో ఈనాడు మొదలైంది కాదు, అది మా వ్యక్తిత్వంలోనే ఉంది. కష్టాల్లో ఉండి సహాయం అడిగేవారికి మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ రోజు ఆ సేవా స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేలా మరిన్ని హృదయాలను ఆహ్వానిస్తున్నాము. మౌనిక ఆలోచనల నుంచి పుట్టిన ఈ ‘ఐక్య’ మా మనసుకు ఎంతో దగ్గరైనది. ఐక్య అంటే కలయిక.. మానవత్వం కోసం అందరం ఒక చోట చేరడం. భగవంతుడు మాకు ఇచ్చిన దానిని సేవ, విలువలు, సదుద్దేశం ద్వారా ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర వైద్య సహాయం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ద్వారా ఎక్కడ సహాయం అవసరమైతే అక్కడ ‘ఐక్య’ ముందుంటుంది. ఇది రాజకీయమైనది కాదు. ఇది మా ఒక్కరిదీ కాదు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిదీ. ఎందుకంటే తమకంటే గొప్ప ఉద్దేశం కోసం మనసులన్నీ ఏకమైనప్పుడు, జీవితాలు మారడమే కాదు.. కొత్త ఆశ మళ్లీ ఊపిరిపోసుకుంటుంది.’ అని పేర్కొన్నారు.

Next Story