తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా కార్యాచరణ : సీఎస్ కె.రామకృష్ణారావు

by Muthe.Rajitha |

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా కార్యాచరణ : సీఎస్ కె.రామకృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మిషన్ కర్మయోగి అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులతో సమావేశం అయ్యింది. సమావేశంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి వారీలో నైపుణ్యాభివృద్ధి (Skill Upgradation) పెంచేందుకు మిషన్ కర్మయోగి చేపట్టిన శిక్షణా కార్యక్రమాలను, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు డాక్టర్ అల్కా మిట్టల్ వివరించారు.

ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ మిషన్ కర్మయోగి సహకారంతో మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి పలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయా శాఖల వారీగా తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బందికి ఈ కార్యక్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు సమర్థవంతంగా అమలైయ్యిందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడుతాయని అన్నారు. ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ తదితర సంస్థలు సమర్థవంతంగా పలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సిబ్బందికి అధికారులకు మార్గనిర్ధేశనం చేస్తూన్నాయని సి.ఎస్ తెలిపారు.

ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ తరపున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టామని ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక వివరించారు. అదే విధంగా సమాచార శాఖ అధికారులకు, సిబ్బందికి కూడా వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాలు చేపడుతామని ఆమె తెలిపారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, రెవెన్యూ (సిటి అండ్ ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి S.A.M.రిజ్వీ, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, పీసీసీఎఫ్ సువర్ణ, మహిళా సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సెర్ప్ సీఇఓ దివ్య, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story