- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సి‘పోల్’కు యాక్షన్ ప్లాన్ రెడీ..! వార్డుల విభజనకు షెడ్యూల్ రిలీజ్
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మున్సిపల్ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వార్డుల విభజనను మొదలుపెట్టింది. ఇందుకోసం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం ఉండగా.. ఓఆర్ఆర్బయట ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే విభజన చేయాలని నిర్ణయించారు. లోపల ఉన్న 13 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినందున అందులో వార్డుల విభజన చేపట్టడం లేదు.
పాలకవర్గాలు ముగిశాకే..
వార్డుల విభజన చేపట్టే వాటిల్లో 18 కొత్త మున్సిపాలిటీలు, మరో 12 కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో వార్డుల విభజన పూర్తి కాగానే ఎన్నికల కమిషన్ఓటరు జాబితాను సవరించే పనిని చేపట్టనుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగియని 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో (వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల) పాలక వర్గాలు కొనసాగుతున్నందునా వాటిల్లో విభజన చేపట్టడం లేదు. వాటి పదవీ కాలం ముగిసిన తర్వాతనే వార్డుల విభజన చేపట్టనున్నారు. కొత్తగా ఎలాంటి గ్రామాలు కలవడం కానీ, విడిపోవడం కానీ జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం లేదని తేల్చారు.
సర్పంచ్ ఎన్నికల తర్వాతే..
ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణాల్లోనూ వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా తయారీ పూర్తికానున్నది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం నెలకొననుంది.
వార్డుల విభజన జరగనున్న మున్సిపాలిటీలు
వార్డుల విభజన చేపట్టే వాటిల్లో 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఉండగా.. అందులో కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మంచిర్యాల మున్సిపల్కార్పొరేషన్లు ఉన్నాయి. నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హలియా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు కోహిర్, కేసముద్రం, ఆశ్వరావుపేట, స్టేషన్‌ఘన్‌పూర్, ఎదులాపురం, దేవరకద్ర, గడ్డపోతారం, గుమ్మడదల, ఇస్నాపూర్, చేవేళ్ల, మొయినాబాద్, ములుగు, బిచ్కుంద, కొల్లాపూర్, ఆలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి.
పెరగనున్న వార్డుల సంఖ్య
వార్డుల విభజన నేపథ్యంలో వార్డుల సంఖ్య పెరగనున్నది. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేయడంతో వార్డుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మహబూబ్నగర్కార్పొరేషన్లో ప్రస్తుతం 49 వార్డులు ఉండగా ఆ సంఖ్య 60కు పెరగనున్నది. మంచిర్యాలలో 36 నుంచి 60కి, కరీంనగర్‌లో 60 నుంచి 66కు, రామగుండంలో 50 నుంచి 60కు, కొత్తగూడెంలో 34 నుంచి 60కు వార్డుల సంఖ్యను పెంచనున్నారు. ఇందుకు అనుగుణంగా వార్డుల విభజన చేపడుతారు. నర్సంపేటలో 24 నుంచి 30కి, పరిగిలో 15 నుంచి 18కి, జగిత్యాలలో 48 నుంచి 50కి పెరగనుండగా.. కొల్లాపూర్‌లో మాత్రం వార్డుల సంఖ్య 20 నుంచి 19కి తగ్గనుంది.
వార్డుల విభజన ఇలా...
పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల విభజనకు 2021 జనవరి 30వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలనే ఫాలో అవుతున్నారు. వార్డులను మొదట ఉత్తరం నుంచి ప్రారంభించి అటు నుంచి తూర్పు, దక్షిణం, పడమర వైపుగా క్లాక్వైజ్డైరెక్షన్లో చేయాల్సి ఉంటుంది. జనాభా లెక్కలు లేదా తాజాగా ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఒక్కో వార్డు జనాభా లేదా ఓటరు వారీగా వార్డులను విభజించాలని సూచించారు. అన్ని పట్టణ ఓటరు లేదా జనాభా లెక్కలకు సగటును తీసి ఒక్కో వార్డులో 10 శాతం ఎక్కువగా కాకుండా ఉండే విధంగా చూడాలని సూచించారు.
వార్డుల విభజన షెడ్యూల్:
తేదీ - వార్డుల విభజన
జూన్ 3 - విభజన ముసాయిదా సిద్ధం చేయడం
జూన్ 4 - ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచడం
జూన్ 5 - నుంచి 11 వరకు.. - ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు స్వీకరించడం
జూన్ 12 నుంచి 16 వరకు - అభ్యంతరాలను పరిశీలించి వాటిని క్లియర్‌చేయడం
జూన్ 17 - తుది జబితాను కలెక్టర్ఆమోదానికి పంపించడం
జూన్ 19 - సీడీఎంఏ ఆమోదానికి పంపించడం
జూన్ 20 - ప్రభుత్వ ఆమోదానికి సీడీఎంఏ పంపించడం
జూన్ 21 - ఫైనల్ నోటిఫికేషన్ విడుదల






