Accreditation Cards: జర్నలిస్టులకు తీపికబురు.. అక్రిడిటేషన్లకు ఈనెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 09:34:49  IST  )

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ను అధికారికంగా ఇవాళ విడుదల చేసింది.

Accreditation Cards: జర్నలిస్టులకు తీపికబురు.. అక్రిడిటేషన్లకు ఈనెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) జీవో నెం.252ను జారీ చేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా ప్రతినిధులు ఫిబ్రవరి 9 నుంచి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలను (DMAC) ఏర్పాటు చేయనున్నారు. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండనుంది. అక్రిడిటేషన్లకు అర్హత కోసం దినపత్రికలు కనీసం 2 వేల ప్రతుల సర్క్యులేషన్ కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. అదేవిధంగా వార, పక్ష పత్రికలు కనీసం 18 నెలల పాటు నిరంతరంగా ప్రచురితమై ఉండాలనే కండీషన్ కూడా ఉంది.

డెస్క్ జర్నలిస్టుల విషయంలో మీడియా సంస్థలు కనీసం 33 శాతం మహిళలకు కేటాయించడం తప్పనిసరి చేశారు. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీసం ఏడాది కాలంగా నడుస్తున్న వెబ్‌సైట్లు, గత ఆరు నెలల్లో సగటున నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్లను కలిగి ఉన్న పక్షంలో అక్రిడిటేషన్‌కు అర్హలు. కార్డు జారీ తర్వాత అక్రిడిటేషన్ కార్డు పోతే డూప్లికేట్ లేదా రీప్లేస్‌మెంట్ కార్డుల కోసం రూ.250 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీకి (SMAC) మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షత వహించగా, ఐ అండ్ పీఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు కూడా స్థానం కల్పించారు. కొత్త నిబంధనల ప్రకారం.. అక్రిడిటేషన్ పొందిన ప్రతినిధులు కార్డులను కేవలం వృత్తిపరమైన అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. తమ విజిటింగ్ కార్డులు లేదా లెటర్ హెడ్‌లపై ‘ప్రభుత్వ గుర్తింపు పొందిన’(Accredited to Government) అని ముద్రించుకోకూడదని కొత్త అక్రిడిటేషన్ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.

Next Story