- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందూరుపై ఏసీబీ నజర్.. అవినీతి అధికారుల్లో గుబులు!
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలపై ఏసీబీ దృష్టి సారించింది. పలు శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పలు అవినీతిపరులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలపై ఏసీబీ దృష్టి సారించింది. పలు శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పలు అవినీతిపరులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పలువురు అధికారులు, సిబ్బందిపై గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా పోడు పట్టాల విషయంలో అటవీశాఖలోని పలువురు సిబ్బంది పైసలు తీసుకుని అర్హులుగా గుర్తించారనే విమర్శలు ఉన్నాయి. ఇలా పోడు పట్టాల విషయంలోనే కాకుండా అక్రమ కలప రవాణా విషయంలోనూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులపైన ఇప్పటికే పంజా విసిరి అక్రమార్జనను వెలికి తీయడమే కాకుండా కటకటాలు లెక్కించేలా చేసిన ఏసీబీ మరోసారి నిజామాబాద్ పై ఫోకస్ చేసింది. తాజాగా అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లు చెప్పుకునే ప్రభుత్వ శాఖల్లో ఒకటైన ఎక్సైజ్ శాఖపై దృష్టి సారించిన ఏసీబీ మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించడం.. ఎక్సైజ్ శాఖతో పాటు మిగతా ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రకంపనలు సృష్టించింది.
ప్రతి నెలా రూ. లక్షల్లో ముడుపులు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు, కల్లు డిపోలు, కల్తీ కల్లు వ్యాపారులు, బెల్టు షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు వారి వారి స్థాయిని బట్టి ప్రతి నెలా రూ. లక్షల్లో ముడుపులు ముడుతున్నాయని ఎక్సైజ్ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగులను ఉన్నతాధికారులు డైరెక్టుగా ముడుపుల కోసం వేధించకుండా వ్యాపారులపై ఒత్తిడి పెంచేలా చేసి వారిని ముడుపులు ముట్టజెప్పేలా దారికి తెచ్చుకుంటారనే టాక్ ఉంది. కొందరు గంజాయి వ్యాపారులతో కూడా కొందరు అధికారులకు డైరెక్ట్ లింకులున్నాయని, వారి సహకారంతోనే జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మహమ్మారి విస్తరించుకుంటోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది కేవలం ఫ్లెక్సీతో ర్యాలీలు తీసి మీడియాలో ప్రచారం చేసే వరకు మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. గంజాయి నియంత్రణలో ఎక్సైజ్ శాఖ వైఫల్యం వెనక ముడుపుల సంస్కృతే కారణమనే ఆరోపణలున్నాయి.
ముడుపులిస్తేనే పనులు జరిగేది..
పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది మొదలుకుని అధికారి వరకు ఏ స్థాయిలో పని జరగాలన్నా ముడుపులు ముట్టనిదే కార్యాలయాల్లో ఉద్యోగులు ఫైల్ టచ్ చేయని పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ శాఖలు ఇలా ఏ ప్రభుత్వ శాఖను తీసుకున్నా ముడుపులివ్వనిదే పని జరగదని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం ఇదే. ప్రభుత్వ శాఖల్లో ముడుపుల సంస్కృతి అంతలా పెరిగిపోయిందనేది విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ముడుపుల కోసం వేధించే ప్రభుత్వ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు తమ పనులు జరిగితే సరిపోతుందని సహిస్తూ ముడుపులిచ్చి పనులు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు బాధితులు చెపుతున్నారు.
తెగింపు ఉన్నవారే ఏసీబీ ని ఆశ్రయిస్తున్నారు..
అధికారుల వైఖరితో విసిగి వేసారి పోయిన బాధితుల్లో చాలా మంది పోనీలే అని వదిలేస్తున్న వారే ఎక్కువగా ఉన్నప్పటికీ, కొందరు ధైర్యంగా తెగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అలాంటి వారే సామాజిక బాధ్యతతో అవినీతి తిమింగలాల భరతం పట్టేందుకు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వారికి బాసటగా నిలుస్తూ కొన్ని కేసుల్లో వారి వివరాలు బయటకు వెల్లడించకుండా గోప్యతను పాటిస్తున్నారు. గతంలో కన్నా జనాల్లోనూ ఇప్పుడు చైతన్యం పెరిగింది. అవినీతిని సహించే ఓర్పు, సహనం నశించాయి. ప్రతి ఒక్కరూ అవినీతిపై కొరడా జులిపించాలనే ఆలోచనతో ఉన్నారు. వారంతా ఏసీబీని నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ముందుకొచ్చి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. గోప్యంగా సమాచారాన్ని కూడా ఇస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై, ప్రభుత్వ శాఖలపై ఫోకస్ పెట్టి రైడ్ లు నిర్వహిస్తోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాలు లెక్క పెట్టిస్తోంది.
రెండేళ్లలో జరిగిన పలు ఏసీబీ రైడ్స్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండేళ్లలో జరిగిన పలు ఏసీబీ రైడ్స్ కు సంబంధించిన కేసులను పరిశీలిస్తే.. 2024 లో నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐ గా పని చేసే ఉద్యోగి ఇంటిపై ఏసీబీ అధికారులు రైడ్ జరిగింది. ఈ రైడ్ ఏసీబీ అధికారులకు దిమ్మ దిరిగిపోయేలా భారీగా ఆదాయానికి మించిన దాదాపు రూ. 6.07 కోట్ల ఆస్తులను గుర్తించారు. 2025 జనవరిలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక సీఐ ఓకేసులో ఫేవర్ చేయడానికి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2025 మే నెలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పై ఏసీబీ రైడ్ నిర్వహించింది. స్టేషన్ కు సంబంధించిన అవినీతి అంశాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 2025 మే నెలలోనే కామారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివ నాయక్, కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ లు ఏసీబీ కి పట్టుబడ్డారు. 2018 నాటి ఒక చీటింగ్ కేసులో విచారణను వేగవంతం చేసి బాధితుడికి అనుకూలంగా వ్యవహరిస్తామని చెప్పి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. తరువాత రూ. 10 వేలకు డీల్ కుదిరడంతో బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ల ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో 2025 నవంబర్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన అనుమతుల మంజూరులో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, లంచాల ఆరోపణలపై కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే మరిన్ని ఏసీబీ దాడులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, భీమ్ గల్ పట్టణాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులపై కూడా ఏసీబీ నజర్ పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.






