- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ ‘బిగ్ బాంబ్’.. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లపై మెరుపు దాడులు
రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (RDO) వంశీమోహన్ ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ (ACB) మెరుపు దాడులకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్/మేడ్చల్ బ్యూరో: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆయనతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడటంతో పాటు, రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టా వెలుగుచూసినట్లుగా సమాచారం.
ప్రభుత్వ భూములే లక్ష్యంగా వలస..
గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవో, ఎమ్మార్వోగా బాధ్యతలు నిర్వర్తించిన వంశీ మోహన్.. ఆ సమయంలో తన పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొట్టేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని పిగ్లీపురంలో ఏకంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ భూమిని తన మామ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ బడా రియల్టర్‌కు దారాదత్తం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి 10 ప్లాట్లను ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
పెద్దల అండతో యథేచ్ఛగా దందా..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వంశీ మోహన్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడవుతోంది. అప్పటి అధికార పార్టీ పెద్దలతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితను ‘అక్క’అని, కేటీఆర్‌ను ‘అన్న’ అని, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను ‘బావ’ అని పలకరిస్తూ.. ఆ సాన్నిహిత్యంతోనే కీలక పోస్టింగులు దక్కించుకొని, యథేచ్ఛగా పైరవీలకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు.. బ్యాంక్ లాకర్లు, ఇతర బినామీ ఆస్తుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు ముగిసే నాటికి ఈ అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఆధారాలు సేకరించిన అనంతరం వంశీ మోహన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.






