ACB 2025 Round UP: 2025లో లంచగొండి అధికారులకు చుక్కులు చూపెట్టిన ఏసీబీ

by Prasad Jukanti |

ఈ ఏడాది ఏసీబీ యాన్యువల్ రిపోర్టును ఏసీబీ డీజీ చారు సిన్హా విడుదల చేశారు.

ACB 2025 Round UP: 2025లో లంచగొండి అధికారులకు చుక్కులు చూపెట్టిన ఏసీబీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2025 సంవత్సరంలో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా (Charo Sinha) వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారని వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 15 అక్రమాస్తుల కేసుల్లో రూ.96.13 కోట్లు వెలికి తీశామని 54 ఆకస్మిక తనిఖీలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, RTA చెక్ పోస్టులపై దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. 115 మందిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చిందని తెలిపారు.

ట్రాప్ కేసుల్లో ఈ ఏడాది రూ.57.17 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో బాధితులకు రూ.35.89 లక్షలు తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఐపీఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది అవినీతి ఫిర్యాదుల కోసం QR కోడ్ కంప్లైంట్ సిస్టమ్ ప్రారంభించామని దూర ప్రాంతాల ప్రజలకు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో ఏసీబీ సిబ్బంది శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ అందించారని తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని, వాట్సాప్ నెంబర్: 9440446106, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదు అవకాశం ఉందన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.




Next Story