యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.. సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీ.ఏ.ఎన్.హెచ్.ఏ) ప్రకటించినా వైద్య సేవలపై ఆ ప్రభావం పడలేదు.

యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.. సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీ.ఏ.ఎన్.హెచ్.ఏ) ప్రకటించినా వైద్య సేవలపై ఆ ప్రభావం పడలేదు. రాష్ట్రంలో చాలా నెట్‌వర్క్ హాస్పి్టల్స్‌లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగాయి. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా మటుకు సమ్మెకు దూరంగా ఉన్నాయి. బుధవారం ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన హాస్పిటల్స్ 87 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే వైద్య సేవలు ఆగినట్లు సమాచారం. అయినప్పటికీ వైద్య సేవలు కొనసాగించాలని ఆయా హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత రెండు వారాలుగా సగటున రోజూ 844 సర్జరీలు నమోదవగా... ఒక్క బుధవారం నాడే 799 సర్జరీలు నమోదు అయ్యాయని ఆరోగ్యశ్రీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టీ.ఏ.ఎన్.హెచ్.ఏ వైద్య సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించిన తరుణంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 477 ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తుండగా... కేవలం 62 హాస్పిటల్స్ మాత్రమే సేవలు బంద్ చేశాయని 415 హాస్పిటల్స్ లో సేవలు యధావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

వైద్య సేవలు కొనసాగించండి..

గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి కనీసం రూ. 50 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని... కానీ తాము నెలకు రూ. 100 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినా సమ్మె చేయడమేంటని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మండిపడ్డారు. బుధవారం అమీర్ పేట సీహెచ్సీలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిదన్నర ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తాము ఎంతో కమిట్మెంట్ తో కృషి చేస్తున్నామని తెలిపారు. తాము ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 ప్రొసీజర్స్ తీసుకురావడంతో పాటు ధరలను రివైజ్ చేయడంతో సుమారు రూ. 487 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందన్నారు. ప్రస్తుతం 1385 ప్రొసీజర్స్ ద్వారా తాము వైద్యం అందిస్తున్నామన్నారు. గతంలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ చెల్లింపుల అంశంలో తేడా గమనించాలని కోరారు. ఇప్పటికే ఈ నెలకు అవసరమైన రూ. 100 కోట్లను తాము విడుదల చేశామని... ఇప్పటికైనా సమ్మె విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తక్కువ ధరకే సేవలు అందించిన నెట్వర్క్ హాస్పిటల్స్... తాము ధరలు పెంచినందుకు స్ట్రైక్ చేస్తున్నారా అని నిలదీశారు. ఇప్పటికైనా పేదలకు వైద్య సేవలు అందించేందుకు నెట్వర్క్ హాస్పిటల్స్ ముందుకు రావాలని ఆయన కోరారు. వైద్య సేవలు ఆగే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు.

Next Story