రాష్టంలో కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ.. రేషన్‌కార్డుల జారీతో పెరిగిన లబ్ధిదారులు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.

రాష్టంలో కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ.. రేషన్‌కార్డుల జారీతో పెరిగిన లబ్ధిదారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో అటోమెటిక్‌గా వారు ఆరోగ్యశ్రీకి అర్హులవుతున్నారు. ఇలా అర్హులైన వారి సంఖ్య 30 లక్షలకు పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్కీమ్ బకాయిలు సుమారు రూ.1,590 కోట్లు చెల్లించింది. దీంతో తమ ఆస్పత్రుల్లో పథకం కింద చికిత్స చేసేందుకు అనేక ప్రయివేటు ఆస్పత్రులు ముందుకొస్తున్నాయి. చికిత్స అందించే లిమిట్ ఎక్కడా లేని విధంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడంతో తీవ్ర అనారోగ్యాలకు గురైన వారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకునే అవకాశం ఉంది.

కొత్త లబ్ధిదారుల లెక్కలు ఇలా..

గతంలో 90.10 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. దీని ద్వారా సుమారు 2.84 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నది. మొత్తం 93,99,361 కుటుంబాలకు గాను 3 కోట్లా 14 లక్షల పైగా లబ్ధిదారులు ఉన్నారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ పథకానికి 30 లక్షల మంది యాడ్ అయ్యారు. ఒకసారి తెల్ల రేషన్‌కార్డు మంజూరైతే వారి పేర్లు అటోమెటిక్‌గా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావడంతో పథకాన్ని అమలు చేయడం మరింత తేలికగా మారింది.

100 ఆస్పత్రులు అప్లయ్

పదేళ్ల తర్వాత ఆరోగ్యశ్రీ చికిత్సలో అమలవుతున్న ప్యాకేజీలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల రివ్యూ చేశారు. ఆస్పత్రుల నుంచి వస్తున్న విన్నపాలను గమనించి ప్యాకేజీ ధరలను సుమారు 22 శాతం పెంచారు. 20 నెలల్లో మొత్తం రూ.1590 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సైతం పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. దీని పరిధి సైతం ప్రభుత్వం ఏకంగా రూ.10 లక్షలకు పెంచడంతో అనేక రోగాలకు చికిత్స అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 100 ప్రయివేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేందుకు ప్రభుత్వానికి అప్లయ్ చేసుకున్నాయి. దీర్ఘకాలిక రోగాలైన కిడ్నీ సంబంధిత వ్యాధులకు సైతం మెరుగైన చికిత్స అందుతుండడంతో ఎక్కువ మంది ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం తెలిపింది.

Next Story