స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-27 02:12:38  IST  )

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్/వైరా: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (Banoth Madan Lal) గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆయనను పరీక్షించిన వైద్యులు మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. అయితే ఈలోపే పరిస్థితి మరింత విషమించడంతో మదన్ లాల్ ఇవాళ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా, మదన్ లాల్ 1963 మే 03న ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశాడు. 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47,539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ‌లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బానోత్ బాలాజీ‌పై 10,583 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంతరం ఆయన 2018లో ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్‌ చేతిలో 2,013 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

Next Story