నిఘా నేత్రాలున్నా..ఆగని దోపిడీలు

by velandi.Saikiran |

నిఘా నేత్రాలున్నా..ఆగని దోపిడీలు
X

నిఘా నేత్రాలున్నా..ఆగని దోపిడీలు

రాష్ట్ర వ్యాప్తంగా 12లక్షల సీసీ కెమెరాలు

17,700 దొంగతనం కేసులు

512 దోపిడీ, 340 చైన్ స్నాచింగ్ కేసులు

8 ఏటీఎం దొంగతనాలు

దిశ, తెలంగాణ బ్యూరో :రాష్ట్రం సాంకేతిక పరిజ్ఞానంతో నేర నివారణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. 'సేఫ్ సిటీ' ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళాన్ని నిఘా నీడలోకి తెచ్చేందుకు ప్రభుత్వం లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇంతటి కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ, నేరగాళ్లు ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. తాజాగా వెలువడిన నేర గణాంకాలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసు నివేదిక పరంగా దోపిడీ, దొంగతనాల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేరాల సంఖ్య మాత్రం అభద్రతను కలిగిస్తుంది.

ఖాకీలకే సవాల్..

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కాలంలో నమోదైన కేసులు పరిశీలిస్తే, దొంగలు తమ పంథాను మార్చుకుని పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 2025లో మొత్తం 17,700 దొంగతనాల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో పగలు ఇళ్లలో చొరబడటం , తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం వంటి నేరాలు అధికంగా ఉన్నాయి. నిఘా కెమెరాలు ఉన్నాయని తెలిసినా, దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి, కెమెరాల కనెక్షన్లను కట్ చేస్తూ సాహసోపేతమైన దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు 340 నమోదయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాలే కాకుండా, జనసమ్మర్థం ఉన్న వీధుల్లో కూడా బైక్‌లపై వచ్చి బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. వీరికి తోడు 512 దోపిడీ కేసులు రికార్డయ్యాయి. మారణాయుధాలతో బెదిరించి నగదు, నగలు అపహరించడం వంటి సంఘటనలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

ఏటీఎంలూ ధ్వంసం..

సాంకేతికతను వాడుకుని ఏటీఎంలే లక్ష్యంగా నేరాలకు పాల్పడే ముఠాలు కూడా తెలంగాణలో చురుగ్గా ఉన్నాయి. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను ధ్వంసం చేయడం, నగదును మాయం చేయడం వంటి 8 ఏటీఎం దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి అంతర్రాష్ట్ర ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీటీ పరిధిలో డెకాయిటి కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 72 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం 58 నమోదయ్యాయి. 24 కేసులు ఆదనంగా నమోదవడం కూడా కొంత పోలీస్ శాఖకు సవాలుగా మారింది. ఈ కేసులలో హైదరాబాద్ కమిషనరెట్ పరిధిలో 17, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17 నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా రాబరీ కేసులు కూడా నగర పరిధిలో నమోదైయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 129, హైదరాబాద్ పరిధిలో 105, రాచకొండ పరిధిలో 65 నమోదయ్యాయి.

12లక్షల సీసీటీవీ కెమెరాలు..

రాష్ట్ర వ్యాప్తంగా 12,09,782 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు అధికారిక గణంకాల ద్వారా తెలుస్తున్నది. 2024లో 53,651 సీసీ కెమెరాలను ఆదనంగా ఏర్పాటు చేయగా 2025లో మరో 45,137 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 2024 వార్షిక నివేదికలో 11,64,645 కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 9లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. 16వేల కెమెరాలు నేరుగా పోలీసుల నియంత్రణలో ఉండగా, మిగిలినవి 'నేను సైతం' వంటి కమ్యూనిటీ ప్రాజెక్టుల కింద ఉన్నాయి. రాష్ట్రంలోని 774 పోలీస్ స్టేషన్లలో సుమారు 10,330 కెమెరాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ఇంత నిఘా వ్యవస్థ ఉన్న నేరాల నియంత్రణ ఆశించిన స్థాయిలో జరగడం లేదని పోలీస్ శాఖను కలవరపడేలా చేస్తుంది.

థెఫ్ట్ కేసులు డెకాయిటి రాబరీ

2021 12,531 37 441

2022 14,494 29 501

2023 14,393 42 495

2024 19,480 58 703

2025 17,700 72 512

2025లో నమోదైన దొంగతనాలు కమిషనరేట్‌‌ల వారిగా వివరాలు

థెఫ్ట్ కేసులు డెకాయిటి రాబరీ

హైదరాబాద్ 4,410 19 105

సైబరాబాద్ 2,960 17 129

రాచకొండ 2,016 -- 65

Next Story