- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
ఆరడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని.. భవిష్యత్తులో మరికొందరికి చేయబోతోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆరడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని.. భవిష్యత్తులో మరికొందరికి చేయబోతోందని హరీశ్ రావును ఉద్దేశించి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీకి కూడా గతంలో వెన్నుపోటు పొడుద్దామని అనుకున్నారని, ఇందులో భాగంగా ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంత రావు సహా అంతా పార్టీ వీడారని గుర్తు చేశారు. జగ్గారెడ్డితో పాటు విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీని వీడింది హరీశ్ రావు వల్లేనని కవిత అన్నారు.
సంతోష్ రావుకు ధనదాహం ఎక్కువ..
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం కూడా హరీశ్ రావేనని కవిత తెలిపారు. ఇక సంతోష్ రావుకు ధనదాహం చాలా ఎక్కువ అని కామెంట్ చేశారు. సిరిసిల్ల పరిధిలో ఇసుక లారీ వల్ల ప్రమాదం జరిగితే.. ఏడుగురు యువకులను థర్డ్ డిగ్రీతో కాళ్లు, చేతులు లేవకుండా చేయించింది అతడేనని అన్నారు. కానీ, ఆ అపవాదు మాత్రం కేటీఆర్‌పై పడిందని అన్నారు. టానిక్ మద్యం షాపుపై కేసు పెట్టారని.. అండర్‌స్టాండింగ్ కుదరకపోతే ఆ కేసును ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలన్నారు. సినిమా హీరోలతో ఫోజులు ఇచ్చి ఫారెస్ట్‌ను కోట్టేయాలని సంతోష్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. సంతోష్ రావు క్లాస్‌మెట్ తప్ప.. ఏ అర్హత ఉందని అతడికి పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. హరీవ్ రావు, సంతోష్ రావు గ్యాంగులు కాంగ్రెస్ సర్కార్‌తో కుమ్మక్కయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఇప్పుడే.. తన పదవులకు రాజీనామా చేస్తూ లేఖలను తెలంగాణ భవన్‌కు పంపుతున్నానని కవిత తెలిపారు.
కనీస విచారణ లేకుండా నాకు ఉరేశారు..
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు, సంతోష్ రావులదే కంట్రిబ్యూషనే ఉందా.. తనది లేదా అని కవిత ప్రశ్నించారు. కలికాలం కాబట్టి వాళ్ల మాటలు కొంత కాలం నమ్ముతారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హార్డ్‌వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్‌వేర్ అని అన్నారు. ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆరోపించారు. కేసీఆర్ రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రశ్నించే స్థాయి వాళ్లకు లేదన్నారు. పెద్ద నాయకులు చాలా సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారని.. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. రెండు గ్యాంగులు తనపై జరగనివి.. జరిగినట్లుగా చేయించారని కామెంట్ చేశారు. తాను కేసీఆర్ దగ్గరకు వెళ్లితే.. గన్‌మెన్లు అడ్డుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు రాయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంత వరకు తన లేఖను లీక్ చేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. కనీస విచారణ లేకుండా నాకు ఉరేశారని, మరి లీకువీరులపై చర్యలేవని కవిత డిమాండ్ చేశారు.






