అధికార పార్టీ నేతల మధ్య అప్పుడే సీట్ల పంచాయితీ

by Malleboina Mahesh |

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల కోసం అధికార పార్టీ నేతల మధ్య పంచాయితీ నెలకొంటున్నది.

అధికార పార్టీ నేతల మధ్య అప్పుడే సీట్ల పంచాయితీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల కోసం అధికార పార్టీ నేతల మధ్య పంచాయతీ నెలకొంటుంది. ఇప్పటి నుంచే కొందరు నాయకులు స్థానికంగా బలం పెంచుకోవడం, తమ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలు, వారి కేడర్ కు మధ్య తరచుగా వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

గాంధీభవన్ కు వివాదాలు

గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ప్రస్తుతం అక్కడి నుంచి మాజీ మంత్రి, దివంగత నేత దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల గాంధీభవన్ లో ఇరువర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేసుకోవడంపై చర్చకు దారితీసింది. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డిలు, తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల వర్గీయులు విడిపోయారన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, స్థానిక నేతలకు మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రావడం లేదు.

పార్టీ ఆదేశిస్తే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని జగ్గారెడ్డి చేసిన కామెంట్లు ఆ నియోజకవర్గంలో చర్చకు దారితీశాయి. జహీరాబాద్ లో గతంలో పోటీ చేసిన నేతకు, స్థానిక నేతలకు పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గజ్వేల్ అంశంపైనా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులు వర్గాలు విడిపోయి ఒకరిపై ఒకరు గాంధీభవన్ లో పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిల మధ్య కొన్ని రోజులుగా వర్గపోరు నడిచింది. గాంధీభవన్ లో ఇరు నేతల మధ్య క్రమశిక్షణా కమిటీ రాజీ కుదిర్చింది.

ఇంకా అనేక సెగ్మెంట్లలో

నిజామాబాద్ అర్బన్ లో టీపీసీసీ చీఫ్ పోటీ చేస్తారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రెండు వర్గాలు విడిపోయారని, ఆధిపత్య పోరు నడుస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్యకు, స్థానిక కాంగ్రెస్ క్యాడర్‌కు మధ్య తరుచు వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. గద్వాల్ లో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ కు మధ్య విభేదాలు నెలకొన్నాయి.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ కేడర్ కు మధ్య పొసగడం లేదని చర్చ నడుస్తోంది. ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు, నేతలకు, మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యలేకు, స్థానికంగా ఉన్న సీనియర్ నేతలకు మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ జోక్యం చేసుకొని నేతల మధ్య సయోధ్య కుదిరిస్తే విభేదాలు సమసి పోతాయని, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య మరింత ముదర వచ్చిన పార్టీ వర్గాలు అంటున్నాయి.

Next Story