- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'డిజిటల్ టోలింగ్'తో అంతరాయం లేని ప్రయాణం
'డిజిటల్ టోలింగ్'తో అంతరాయం లేని ప్రయాణం

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను జత చేస్తోంది. ప్రయాణికుల సౌకర్యం, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ రహదారుల వ్యవస్థను స్మార్ట్ నెట్‌వర్క్‌గా మారుస్తోంది. వాహనదారుల అరచేతిలో జాతీయ రహదారులు, సౌకర్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందేలా కొత్త వేదికలను తీసుకువస్తోంది. డిజిటల్ టోలింగ్ వంటి అధునాతన వ్యవస్థలతో అంతరాయం లేని ప్రయాణానికి మార్గం సుగమం చేస్తోంది. టెక్నాలజీ సహాయంతో జాతీయ రహదారుల నిర్వహణను సైతం మరింత మెరుగుపరుస్తోంది.
11 ఏళ్లలో 60 శాతం పెరిగిన హైవే వ్యవస్థ
భారత్‌లో 63 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్డు వ్యవస్థ ఉంది. ప్రపంచంలో ఇది రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ. జాతీయ రహదారుల విషయానికి వస్తే 2013-14లో దేశంలో 91,287 కిలోమీటర్ల జాతీయ రహదారి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు దాదాపు 60% పెరిగి 1,46,204 కిలోమీటర్లకు చేరుకుంది. 2014 నుంచి 2025 మధ్య దేశంలో కొత్తగా 54,917 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. దీనికి తగ్గట్టే జాతీయ రహదారులను వినియోగించే వాహనదారులు, ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయులు జాతీయ రహదారులను వినియోగిస్తున్నారు.
'డిజిటల్ టోలింగ్'తో నాన్ స్టాప్ జర్నీ
హైవేలపై టోల్ గేట్‌ల దగ్గర వాహనాలు బారులు తీరడం, టోల్ చెల్లించేందుకు సమయాన్ని వృథా చేసుకోవడం ఇక గతం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థతో టోల్ వసూలు వ్యవస్థ వేగంగా మారిపోయింది. నిమిషం కూడా నిలబడాల్సిన అవసరం లేకుండా వాహనాలు ఇప్పుడు టోల్ గేట్లు దాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఫాస్టాగ్ వాడుతున్నారు. ఇటీవల నాన్-కమర్షియల్ వాహనాల కోసం ఫాస్టాగ్ వార్షిక పాస్ సదుపాయం ప్రారంభమైంది. దీని ద్వారా రూ.3 వేలు చెల్లిస్తే ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాలను దాటవచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఇది పనిచేస్తుంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వినియోగదారులు ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందారు. 5.67 కోట్లకు పైగా టోల్ లావాదేవీలు నమోదయ్యాయి.
టోల్ ప్లాజా లేకుండానే జాతీయ రహదారి
2025 ఆగస్టులో దేశంలో తొలి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థను కేంద్రం గుజరాత్‌లో ఎన్‌హెచ్-48పై చోర్‌యాసీ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసింది. ఇది బారియర్-ఫ్రీ, కెమెరా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థ. వాహనం వెళ్తుండగానే ఫాస్టాగ్, వాహన నెంబరును ఇది నమోదు చేస్తుంది. వాహనాలను ఆపకుండానే సులభంగా టోల్ వసూలు చేయొచ్చు. తద్వారా రద్దీని తగ్గించవచ్చు. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్
హైవేలపై ప్రయాణించే వారి కోసం కేంద్రం తెచ్చిన రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో హైవేలు, టోల్ ప్లాజాలు, సమీపంలో ఉండే పెట్రోల్ పంప్‌లు, ఆసుపత్రులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి సౌకర్యాల వివరాలతో పాటు వాతావరణ సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుతుంది. బహుభాషల్లో ఈ యాప్ ఉంటుంది. ఫాస్టాగ్ సేవలను కూడా ఇందులో పొందవచ్చు. వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్పీడ్ లిమిట్ అలెర్ట్స్ కూడా ఈ యాప్‌లు వస్తుంటాయి. హైవేలకు సంబంధించి రోడ్డుపై గుంతలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఆక్రమణలు, భద్రతా సంబంధించిన అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జియో-ట్యాగ్‌డ్ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదుల పురోగతిని ట్రాక్ చేయవచ్చు. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ విశేష ఆదరణ పొందింది. గూగుల్ ప్లే స్టోర్ ఓవరాల్ ర్యాంకింగ్‌లలో 23వ స్థానం, ట్రావెల్ విభాగంలో 2వ స్థానంలో ఈ యాప్ ఉంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌నకు ప్లేస్టోర్‌లో 4.5 స్టార్స్ రేటింగ్ ఉంది. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వ యాప్‌గా రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ మారింది.
ఎన్‌హెచ్ఏఐ వన్ యాప్
జాతీయ రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రాజెక్టుల నిర్మాణం సమయానికి పూర్తయ్యేలా చూసేందుకు, అంతర్గత ప్రక్రియలను, సమన్వయాన్ని సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ వన్ పేరుతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక యాప్‌ను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు, హైవేల నిర్వహణ, రహదారి భద్రతా తనిఖీలు(రోడ్ సేఫ్టీ ఆడిట్స్), మరుగుదొడ్ల నిర్వహణ, రోజువారీ నిర్మాణ తనిఖీలు వంటివి ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ప్రాంతీయ అధికారులు(ఆర్వో), ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)ల నుంచి కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సేఫ్టీ ఆడిటర్లు, టోల్ ప్లాజాల దగ్గర టాయిలెట్ సూపర్‌వైజర్ల వరకు ఈ యాప్‌లో రోజువారీ కార్యకలాపాలను నమోదు చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్ వంటి ఫీచర్లతో ఈ యాప్ జవాబుదారీతనాన్ని, కచ్చితత్వాన్ని పెంచుతోంది.
ప్రాజెక్ట్ ఇన్‌ఫర్మేషన్ సైన్ బోర్డులు
హైవేలపై ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ ఇన్‌ఫర్మేషన్ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌లతో ఇవి ఉంటాయి. ప్రాజెక్టు వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌లు, సమీపంలో ఉండే ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి వివరాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పొందవచ్చు.
నెట్‌వర్క్ సర్వే వెహికిల్స్
జాతీయ రహదారుల నిర్వహణ పకడ్బందీగా మార్చేందుకు నెట్‌వర్క్ సర్వే వెహికిల్స్(ఎన్ఎస్‌వీ)ను ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటుచేస్తోంది. ఈ వాహనాలకు 3డీ లేజర్ వ్యవస్థలు, 360 డిగ్రీల కెమెరాలు ఉంటాయి. 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల మేర ఇవి పనిచేస్తున్నాయి. ఇవి రోడ్డు సమస్యలను ఆటోమెటిక్‌గా గుర్తిస్తాయి. తద్వారా వీటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది.






