గర్జించిన ‘ఆదివాసీ పోరుకేక

by Ratna Kumari |

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గుంజేడు ముసలమ్మ ప్రాంగణం బుధవారం ఆదివాసీ గర్జనతో మారు మ్రోగింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ పోరుకేక భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు.

గర్జించిన ‘ఆదివాసీ పోరుకేక
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గుంజేడు ముసలమ్మ ప్రాంగణం బుధవారం ఆదివాసీ గర్జనతో మారు మ్రోగింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ పోరుకేక భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన తొమ్మిది తెగల సమస్యయ కర్త & చైర్మన్ చుంచ రామకృష్ణ, ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ముందుగా కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంప్రదాయ డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఆదివాసీల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నారు.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ ఆదివాసీ బతుకు మాత్రం మారడం లేదు అన్నారు. అడవిని కాపాడిన ఆదివాసీ నేడు తన హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కొత్తగూడలో ఈ పోరుకేక వినిపిస్తున్నాం అని తెలిపారు.

ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్న గిరిజన యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని మాకు మెగా డీఎస్సీ కాదు.. ఏజెన్సీ డీఎస్సీ కావాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను స్థానిక ఆదివాసీ యువతతోనే భర్తీ చేయాలి. ఏజెన్సీ అలవెన్స్ ఇస్తున్నారు కానీ ఏజెన్సీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు" అని విమర్శించారు.

పోడు భూములకు న్యాయం చేయాలి

తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు ఇప్పటికీ పూర్తి హక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. "పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. గిరివికాస్ బోర్లు మంజూరు చేయాలి. ఆదివాసీ రైతుకు నీరు, భూమి, సాగు భద్రత కల్పించాలి" అని డిమాండ్ చేశారు.

వడ్డీ వ్యాపారాలపై ఆగ్రహం

ఏజెన్సీ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాల కారణంగా గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు "20 ఏళ్లుగా వడ్డీ వ్యాపారాలు ఆదివాసీల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మా పోరాటం వ్యక్తులపై కాదు.. ఆదివాసీల అస్తిత్వం, హక్కులు, భవిష్యత్తు కోసం సభలో లంబాడీల ఎస్టీ హోదా అంశాన్ని ప్రస్తావించిన డా. మైపతి అరుణ్ కుమార్, ఈ విషయంలో ఆదివాసీ సంఘాలు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నాయని షెడ్యూల్డ్ తెగల జాబితాలో లంబాడీల కొనసాగింపుపై ఆదివాసీ సంఘాలకు అభ్యంతరాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగాలు, సంక్షేమ అవకాశాలపై ప్రభావం పడుతోందని ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత రాజ్యాంగ సంస్థలు సమగ్రంగా పరిశీలించాలి" అని డిమాండ్ చేశారు. "మా పోరాటం వ్యక్తులపై కాదు.. ఆదివాసీల అస్తిత్వం, హక్కులు, భవిష్యత్తు కోసం. మా వాదనలను ప్రభుత్వం వినాలి డిమాండ్ చేశారు.

జనసంద్రంగా మారిన సభా ప్రాంగణం

ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.సభ ముగింపులో డా. మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ..కొత్తగూడలో వినిపించిన ఈ పోరుకేక కేవలం ఒక సభ కాదు... ఆదివాసీ సమాజం తన హక్కులు, గౌరవం, భూములు, భవిష్యత్తు కోసం వినిపించిన గళం. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది అని ప్రకటించారు.

భారీ బందోబస్తు

సభ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 511 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, సభా ప్రాంగణం, బస్ స్టాండ్, ప్రవేశ మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి.

Next Story