Narayana bird: రాష్ట్రంలో అరుదైన పక్షి ప్రత్యేక్షం.. ఎక్కడంటే?

by D.Reddy |
Narayana bird: రాష్ట్రంలో అరుదైన పక్షి ప్రత్యేక్షం.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అరుదైన జాతికి చెందిన వలస పక్షి (Rare Bird) కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక్షమైంది. తెలుగులో 'నారాయణ పక్షిగా (Narayan Bird)' పిలిచే ఈ పక్షికి పొడవాటి కాళ్లు, ముక్కు ఉండగా.. నలుపు, బూడిద రంగుల్లో రెక్కలు ఉన్నాయి. ఈ పక్షిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక దీని శాస్త్రీయ నామం ఆర్డీయా సినిరియా (Ardea cinerea) అని కరీంనగర్‌ ఎస్సారార్‌ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి తెలిపారు.

ఈ నారాయణ పక్షి సుమారు 90 సెం.మీ. నుంచి 98 సెం.మీ. పొడవు ఉండి 2 నుంచి 3 కేజీల వరకు బరువు ఉంటుంది. అలాగే తల వెనక జుట్టు పిలకలా పోలి ఉంది. దీని మౌనత్మక స్వభావం, సుదీర్ఘంగా ఒకేచోట నిలబడి ఉండగల సామర్థ్యం దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. సాధారణంగా నీటి లోతు తక్కువగా ఉండే చిత్తడి నేలలు, నదులు, సరస్సు తీర ప్రాంతాల్లో నివసించే ఈ పక్షి యూరప్, ఆసియా, ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అరుదైన పక్షి కనిపించటంతో ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పక్షుల సహజ నివాసాలు ధ్వంసమవుతుండటం వంటి కారణాలతో ఆహారం, నీరు లభించే ప్రాంతాలకు పక్షులు వలస వస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story