- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ambedkar Open University: ప్రతీ విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం
విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంచడం, ఉపకార వేతన ఆధారిత విద్యను అందించనున్నట్లు బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంచడం, ఉపకార వేతన ఆధారిత విద్యను అందించనున్నట్లు బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాసి)తో అంబేద్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎల్వీకే రెడ్డి, రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (రాసి) ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్‌లు ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం యూనివర్శిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయమన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం పెంచేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. స్టైఫండ్ ఆధారిత విద్యను (స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రాం –ఎస్ఏసీ) సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేస్తామని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీ వెబ్ పోర్టల్‌లో వివరాలను పొందుపరుస్తామని వెల్లడించారు. రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించడం, లేదా వాళ్ళను వ్యాపారవేత్తలుగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా నెలకు కనీసంగా రూ. ఏడు వేల నుంచి గరిష్టంగా 24 వేలు లేదా అంత కంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులేనని వెల్లడించారు. ఈ ప్రోగ్రాంలో చేరడానికి 18-28 సంవత్సరాల వయసు గల విద్యార్ధులు అర్హులని పేర్కొన్నారు. తమ విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ప్రఖ్యాత సంస్థలతో మరిన్ని అవగాహన ఒప్పందాలను చేసుకోనున్నట్లు వెల్లండించారు.
రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక అధిపతి జేమ్స్ రాఫెల్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ప్రతీ విద్యార్థికి ప్రయోజనం కలిగించేందుకు తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి చదువుతున్నప్పుడే ఆర్థికంగా సహాయ పడేలా స్టయి ఫండ్ అందించనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, మాట్లాడుతూ.. ఈ కొత్త ప్రోగ్రాంతో ప్రతి విద్యార్థి మరింత ఆర్థికంగా స్వావలంభన సాధించొచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేపడుతామని, విద్యార్ధులకు, వారి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. రాసి ప్రతినిధి సమీర్ నర్సాపూర్, రాసి ఇండస్ట్రీ, అకాడమిక్ (సౌత్ రీజియన్) జనరల్ మేనేజర్ చందా వడ్డే, తదితరులు పాల్గొన్నారు.






