- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీలో రోజుకో వివాదం.. గాంధీభవన్‌కు ఫిర్యాదులతో నేతల క్యూ!
తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నేతల మధ్య వివాదాలు ముదిరి పాకానపడ్డాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నాయకుల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి రావడం పార్టీలో చర్చకు దారితీస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, లోకల్ లీడర్లు మధ్య.. ఒకటి రెండు జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నది. దీనికితోడు కొందరు నేతలు వివాదాస్పద కామెంట్లు చేయడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఏదో ఒక వివాదంపై నేతలు ఫిర్యాదులు చేయడం, వాటిపై నోటీసులు, వివరణ ఇవ్వాలని లేఖలు జారీచేయడం, పిలిచి వివరణ తీసుకోవడం పరిపాటిగా జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలు తరచూ జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు నేతల తీరును తప్పుబడుతున్నారు.
క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య కొన్ని రోజులు వివాదం నడిచింది. దీనిపై ఒకరిపై మరొకరు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేశారు. క్రమశిక్షణ కమిటీ తీసుకున్న చర్యలతో నేతల మధ్య విభేదాలు సమసిపోయి సఖ్యత నెలకొన్నదనే అభిప్రాయం పార్టీ కేడర్ లో ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్, పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మధ్య నెలకొన్న విషయం తెలిసిందే. చివరికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక కామారెడ్డిలో పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ జనరలో సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదంలో క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో విభేదాలు తీవ్రం కావడంతో క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. ఇరు నేతల మధ్య కమిటీ సఖ్యత కుదర్చడంతో ఈ విభేదాలు సమసిపోవడంతో కథ సుఖాంతమైంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, స్థానిక నేతల మధ్య వివాదం క్రమశిక్షణ కమిటీ ముందు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేయగా, ఆయన వివరణ ఇచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే సి.వంశీకృష్ణ.. ఎన్నారై సెల్ ప్రతినిధి అమరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సిద్దిపేట జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, లోకల్ లీడర్ల వివాదం కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తే దానిపైనా విచారణ జరిపారు. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి.. మాజీమంత్రి చిన్నారెడ్డి మద్య విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి. పంచాయతీ ఎన్నికల వేళ ఇరువురు నేతల మధ్య వర్గపోరు బహిర్గతమైంది.
కేడర్ నారాజ్..
తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్యెల్యే శామ్యూల్, స్థానిక నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గాంధీభవన్ కు వచ్చిన నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కొనసాగుతున్నది. దేవాదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనికి కడియం స్పందిస్తూ తాను ఆలయాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కమిషనర్‌ను కలిసినట్లు స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు సైతం వివాదాస్పదమయ్యాయి. దానికి ఆయన స్పష్టత ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నానని స్పష్టత ఇచ్చారు. పార్టీలో కొందరు నేతల మధ్య ఏదో రకంగా విభేదాలు నెలకొనడంపై పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యల వల్ల భవిష్యత్ లో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యనేతలు సమన్వయ పరిచి నష్టనివారణ చర్యలు చేపట్టాలని హస్తం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.






