- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో అద్భుతం.. ‘బాల భీముడి’కి జన్మనిచ్చిన భువనగిరి మహిళ!
సంతాన లేమితో బాధపడుతూ, తల్లిదండ్రులు కాలేక అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ వైద్యం కొండంత అండగా నిలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంతాన లేమితో బాధపడుతూ, తల్లిదండ్రులు కాలేక అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ వైద్యం కొండంత అండగా నిలుస్తోంది. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ (IVF) సెంటర్ మరోసారి ఒక కుటుంబంలో వెలుగులు నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు తొలి ప్రయత్నంలోనే ఐవీఎఫ్ విజయవంతమై, ఏకంగా 4 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన మగబిడ్డ జన్మించాడు. ఆ ‘బాల భీముడిని’ చూసి తల్లిదండ్రులు, వైద్యులు ఆనందంతో మురిసిపోతున్నారు.
12 సార్లు వైఫల్యం.. గాంధీలో సఫలం!
భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లయిన ఇన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో వారు ఎన్నో ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించినట్లు తెలిపారు. సుమారు 12 సార్లు OI (Ovulation Induction), IUI (Intrauterine Insemination) వంటి ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, తీవ్ర నిరాశకు గురైన ఈ దంపతులు గతేడాది గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించారు.
కార్పొరేట్ వైద్యానికి దీటుగా.. ఉచితంగా!
సౌమ్య, రవిల ఆరోగ్య సమస్యను నిశితంగా పరిశీలించిన గాంధీ వైద్యుల బృందం వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను ప్రారంభించింది. మొదటి ప్రయత్నంలోనే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిందని గాంధీ ఐవీఎఫ్ నిపుణులు డాక్టర్ శోభ, డాక్టర్ ఫాతిమా వెల్లడించారు. ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రసవం వరకు అవసరమైన యాంటినాటల్ చెకప్స్, స్కానింగ్‌లు, ఖరీదైన మందులను ప్రభుత్వం తరఫున పూర్తిగా ఉచితంగా అందజేశారు.
తల్లి, బిడ్డ క్షేమం
ఈ నెల 27న సౌమ్య గాంధీ ఆసుపత్రిలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణం కంటే ఎక్కువ బరువుతో (సుమారు 4 కిలోలు) పుట్టినప్పటికీ, ప్రస్తుతం తల్లి, బాబు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ చేతుల్లోకి వచ్చిన బిడ్డను చూసుకుని రవి, సౌమ్య దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, తల్లిదండ్రులను చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులకు, ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ.. ‘ఈ దంపతులు ప్రైవేటు హాస్పిటల్స్‌లో లక్షలు ఖర్చు చేసుకున్నారని, గాంధీ ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా అత్యాధునిక చికిత్స అందించాం’ అని తెలిపారు.






