ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు: లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటున్న కార్మికులు

by Gantepaka Srikanth |

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు: లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటున్న కార్మికులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మిక సంఘాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభానికి ముందు, సమ్మె నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మ బలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కార్మికుడు కూడా ఆవేశంతో ప్రాణాలు తీసుకోవద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

29 డిమాండ్లపై సానుకూలత..

కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వెల్లడించారు. మిగిలిన 3 అంశాలపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని చెబుతున్నా, జేఏసీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం మాటలతో కాకుండా, ఏయే డిమాండ్లను ఎప్పటిలోగా తీరుస్తారో లిఖితపూర్వకమైన హామీ (Written Assurance) ఇస్తేనే సమ్మెపై పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 వేల కోట్ల నిధులను విడుదల చేశామని, మహిళలకు ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) వల్ల ఆర్టీసీకి పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని కార్మికులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ప్రకటించడంతో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story