స్టేట్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. బీజేపీ గూటికి గువ్వల బాలరాజు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 01:02:48  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

స్టేట్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. బీజేపీ గూటికి గువ్వల బాలరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గువ్వల ఈనెల 10న బీజేపీలో చేరబోతున్నట్లుగా రాంచందర్ రావు కాసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు. అయితే, ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీతో పాటు నాగర్‌ కర్నూల్‌ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు తన రాజీనామ పత్రాన్ని కేసీఆర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారే నిర్ణయం అంత తేలికగా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సుమారు 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఓ సైనికుడిగా పనిచేశానని పేర్కొన్నారు. అధినేల కేసీఆర్ నుంచి రాజీకీయాలు నేర్చుకున్నానని కామెంట్ చేశారు. తన ఎదుగుదలకు, ప్రజాసేవ చేసే చేసేందుకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.

గువ్వల నిర్ణయం.. బీఆర్ఎస్ నేతల విస్మయం

కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చాకే తాను రాజీనామా చేశానని కొందరు అనడాన్ని గువ్వల బాలరాజు తప్పుబట్టారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కామెంట్ చేశారు. మీడియా మిత్రులు బీజేపీలోకి వెళ్తున్నారా అని ప్రశ్నించగా.. అదేం లేదని, తనపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని కొట్టి పడేశారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని, కాంగ్రెస్‌లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారేనని పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా ఆయన ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో భేటీ అయి, ఆ పార్టీలో చేరుతున్నానని ప్రకటించడం అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను విస్మయానికి గురి చేస్తోంది.

కాగా, గువ్వల బాలరాజు 1981, జూన్ 10న రాములు, బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని, వనపర్తి గ్రామంలో జన్మించారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఖైరతాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ పీఆర్ఆర్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం చదివారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణ‌పై 9,441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2022 జనవరి 26న గువ్వల బాలరాజు నాగర్‌కర్నూల్ జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల, చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా, ఆగస్టు 2న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

Next Story