రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈ నెల 4 నుంచి గ్రామ, వార్డు సభలు

by Prasad Jukanti |

ఈనెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని, ఓటర్ల సవరణ (SIR), పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈ నెల 4 నుంచి గ్రామ, వార్డు సభలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 4,6,9,10 తేదీల్లో గ్రామ,వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, SIR, రైతుల పంట మార్పిడి, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ఏర్పాట్లతో పాటు, పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా చేపట్టాల్సిన పర్యావరణ అవగాహన కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పంట మార్పిడిపై:

గ్రామ, వార్డు సభల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల ప్రకారం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా (SIR) పై అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల జాబితా అప్ డేట్ కార్యక్రమం ప్రాముఖ్యత గురించి పౌరులకు తగిన సమాచారం అందేలా చూడాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతులు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా వీలు కల్పించే ‘పంటల మార్పిడి’ (crop diversification) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామసభలు, వార్డు సభలను ఉపయోగించుకోవాలని రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలానికి ముందు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ‘రుతుపవనాల సన్నద్ధత’ (monsoon preparedness) చర్యలపై కూడా అవగాహన కల్పించాలన్నారు.

చురుగ్గా పాల్గొనేలా చూడాలి:

గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా నివారించడంపై అధికారులు దృష్టి సారించాలని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల (Solid Waste Management Rules) పై అవగాహన కల్పించాలని, పరిశుభ్రత, పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో సమాజం చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. సామాజిక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, సామాజిక నాయకులు, ఇతరులను గ్రామసభలు, వార్డు సభల నిర్వహణలో చురుగ్గా భాగస్వాములను చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు ప్రతి ఇంటికీ చేరుతాయని పేర్కొన్నారు.

Next Story