- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్ప పువ్వు సారాతో 100 ఏళ్ల ఆయుష్షు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఇప్ప చెట్టుకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉందని.. ఇప్ప పూల సారా తాగితే 100 ఏళ్లు బతుకుతారని అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్ప చెట్టుకు 5 వేల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని, దాని ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్ప పువ్వు వినియోగం, దాని ద్వారా గిరిజనులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని తాండాల ప్రజలు గతంలో ఇప్ప పూల సారా తాగి 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించారని ఆయన గుర్తుచేశారు. ఇప్ప పువ్వును టీలో కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఉపాధి అవకాశాలు..
ఇప్ప పువ్వుతో కేవలం సారా మాత్రమే కాకుండా ఐస్‌క్రీమ్, కేక్స్, లడ్డూలు, బిస్కెట్లు వంటి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 1.6 లక్షల మంది ఇప్ప పూల సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారని, మధ్యప్రదేశ్‌లో ‘మాండ్’ అనే డ్రింక్‌ను బాటిల్ రూ. 800 చొప్పున విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారని వివరించారు. అక్కడ ప్రభుత్వమే శిక్షణతో పాటు యంత్రాలను కూడా అందిస్తోందని తెలిపారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్..
తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని, గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని అన్నారు. బ్రిటిష్ కాలంలో విధించిన పాత నిబంధనలను పక్కన పెట్టి, ఆధునిక పద్ధతుల్లో ఇప్ప ఉత్పత్తులను ప్రోత్సహించాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.






