వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. 90 శాతం వడ్డీ మాఫీ

by Gantepaka Srikanth |

ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పాత బకాయిలను వసూలు చేయడానికి ఓటీఎస్‌కు అవకాశమివ్వాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లేఖ రాసింది.

వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. 90 శాతం వడ్డీ మాఫీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పాత బకాయిలను వసూలు చేయడానికి ఓటీఎస్‌కు అవకాశమివ్వాలని ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లేఖ రాసింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఓటీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శుక్రవారం జారీచేశారు. ఓటీఎస్ ప్రకారం పాత బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాత బకాయిలతో పాటు 10 శాతం వడ్డీతో చెల్లించాలని నిర్ణయించారు.

19.49 లక్షలు..

జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్సియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్సియల్ 2.80 లక్షలు, మిక్స్డ్ 34 వేలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.1550 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. మార్చి31 నాటికి రూ.450కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అత్యధికంగా శేరిలింగంపల్లి, చందానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలవుతుందని అధికారులు చెబుతున్నారు. చార్మినార్ జోన్‌లోని ప్రాంతాల్లో అత్యల్పంగా వసూలవుతున్న విషయం తెలిసిందే.

6.34 లక్షల ప్రాపర్టీల నుంచి రూ.10వేల కోట్ల బకాయిలు..

6.34 లక్షల ప్రాపర్టీల నుంచి రూ.10 వేల కోట్ల ఆస్తి పన్ను బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల నుంచి రూ.5,500 కోట్లు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి రూ.4,500 కోట్లు రావాల్సి ఉందని అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 4వేల భవనాల నుంచి రూ.5 వేల కోట్లు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 భవనాల నుంచి రూ.500 కోట్లు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేదని అధికారులు చెబుతున్నారు.

90 శాతం వడ్డీ మాఫీ..

ప్రభుత్వం ప్రకటించిన ఓటీఎస్ ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని రూ.10 వేల కోట్ల పాత బకాయిలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిపై ఉన్న 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నారు. 10 శాతం వడ్డీతో కలిపి బకాయిదారులు చెల్లిస్తే సుమారు రూ.500 కోట్లు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఎవరైనా 100 శాతం వడ్డీతో చెల్లించినట్టయితే వారికి 90 శాతం వడ్డీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించి ఆస్తి పన్నుల్లో సర్ధుబాటు చేయనున్నారు.

Next Story