పాలిసెట్ లో 83,364 మంది ఉత్తీర్ణత

by Muthe.Rajitha |

రాష్ర్టంలోని పాలిటెక్నికాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ లో 84.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

పాలిసెట్ లో 83,364 మంది ఉత్తీర్ణత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలోని పాలిటెక్నికాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ లో 84.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 83,364 మంది కౌన్సెలింగ్ కు అర్హత సాధించారు. ఈ మేరకు పాలిసెట్ 2025 ఫలితాలను మాసబ్ ట్యాంక్ లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేవ విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షలో ఎంపీసీ విభాగంలో 81.88 శాతం, ఎంబైపీసీలో 84.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ దేవసేన మాట్లాడుతూ ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో కంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయన్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులతో పోలిస్తే డిప్లొమా విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నారని అభిప్రాయపడ్డారు. అదే విధంగా కే సముద్రం, పటాన్ చెరు ప్రాంతాల్లో రెండు కొత్త పాలిటెక్నిక్ కాలేజీలు స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ జూన్ లో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిపారు.

ఈ నెల 13 నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 1,06,716 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా, 98,858 మంది హాజరయ్యారు. వీరిలో 83,364 మంది ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53,085 బాలురకు గానూ 42,836 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదేవిధంగా 45,773 బాలికలకు గానూ 40,528 మంది ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ 120 మార్కులకు నిర్వహించగా, క్వాలిఫైయింగ్ మార్కులు 36 (30 శాతం )గా నిర్ణయించారు.

ఎస్సీఎస్టీలు ఒక్క మార్కులు పొందిన వారు క్వాలిఫై అవుతారు. ఎస్సీ అభ్యర్థులు 18039 మందికి గానూ 18,037 మంది, ఎస్టీ కేటగిరిలో 7,459 మందికి గానూ 7,459 మంది క్వాలిఫై అయ్యారు. -పాలిసెట్ ఫలితాలు, ర్యాంకులను https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్​లో పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, పరీక్ష రాసిన 98,858 మందిలో ఎంపీసీ స్ర్టీమ్ లో 80,949 (81.88శాతం ) మంది, ఎంబైపీసీ స్ర్టీమ్ లో 83,364 (84.33 శాతం ) మంది క్వాలిఫై అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ బీ టెట్ జాయింట్ సెక్రెటరీ షఫీజ్ అక్తర్, డిప్యూటీ డైరెక్టర్ గిరిబాబు, జి.ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

అర్హతలు:

ఎంపీసీ విభాగంలో ర్యాంకుతో సాధారణ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరొచ్చు. ఎంబైపీసీ ర్యాంకుతో జయశంకర్ వ్యవసాయ, పీవీ నర్సింహరావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్శిటీల పరిధిలోని పాలిటెక్నిక్ సీట్లలోనూ ప్రవేశాలు పొందవచ్చు.

Next Story