- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు: నవీన్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు
2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100 శాతం మినహాయింపు అమలులో ఉందని ఆయన తెలిపారు. మంగళవారం బెంగళూరులో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాధించిన పురోగతిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీ వినియోగం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ విధానాలు, టీజీరెడ్కో అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2.8 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని, 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే 91,572 కొత్త ఈవీలు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. కొత్తగా నమోదవుతున్న వాహనాల్లో సుమారు 5 శాతం ఈవీలేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఊహించని విధంగా ఈవీ మార్కెట్ విలువ రూ.6,297 కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రజా రవాణా రంగంలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం 325 ఈ-బస్సులు నడుస్తుండగా, మరో 240 డీజిల్ బస్సులను ఈవీలుగా మారుస్తున్నామని తెలిపారు. 2027 నాటికి హైదరాబాద్‌లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇందుకోసం 10 కొత్త డిపోలు, 10 మధ్యంతర ఛార్జింగ్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,063 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తుండగా, వాటిలో సుమారు 600 హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో టీజీ రెడ్కో దాదాపు 200 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్నదని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈవీ ఛార్జింగ్ వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్రంలో మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలి దశలో రూ.10.24 కోట్లు మంజూరు లభించిందని అన్నారు.






