నగరానికి 550 ఎంజీడీల నీటి సరఫరా.. భవిష్యత్ అవసరాలకు భారీ ప్రణాళికలు: మంత్రి పొన్నం

by Ramesh Naini |

నగర ప్రజల తాగునీటి అవసరాలకు 2014 నుంచి 2023 వరకు పదేండ్ల కాలంలో ఒక్క ఎంజీడీ నీటిని తీసుకొచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు.

నగరానికి 550 ఎంజీడీల నీటి సరఫరా.. భవిష్యత్ అవసరాలకు భారీ ప్రణాళికలు: మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగర ప్రజల తాగునీటి అవసరాలకు 2014 నుంచి 2023 వరకు పదేండ్ల కాలంలో ఒక్క ఎంజీడీ నీటిని తీసుకొచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కృష్ణా మూడు దశలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, గోదావరి తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గోదావరి రెండు, మూడో దశ ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. కేవలం ప్రచారం కోసమే బీఆర్ఎస్ నేతల ప్రకటనలు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మైనారిటీ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ లతో కలిసి హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్ధత, కొనసాగుతున్న మౌలిక వసతుల పనులు, సీవరేజ్ నిర్వహణ, ఎస్టీపీల పనితీరు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, 1989లో ఏర్పడిన జలమండలి పరిధి ప్రస్తుతం విస్తృతంగా పెరిగి కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతాల వరకు చేరిందన్నారు. నగరానికి ప్రస్తుతం కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి, సింగూరు, మంజీర, హిమాయత్ సాగర్ తదితర వనరుల ద్వారా సుమారు 650 ఎంజీడీ నీటి సామర్థ్యం అందుబాటులో ఉండగా, రోజువారీగా సుమారు 550 ఎంజీడీ నీటి సరఫరా జరుగుతోందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి రెండు, మూడో దశ ప్రాజెక్టులను రూ.7 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. అలాగే 2047 విజన్‌కు అనుగుణంగా కృష్ణా నాలుగు, ఐదో దశ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. పాత సింగూర్, మంజీర పైప్‌లైన్‌ల మార్పిడి పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు.

6.23 లక్షల కనెక్షన్లకు ఉచిత నీరు

జలమండలి పరిధిలో ప్రస్తుతం 14.5 లక్షల కనెక్షన్లు ఉండగా, అందులో 6.23 లక్షల కుటుంబాలకు ఉచిత తాగునీటి సరఫరా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో 15 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి నెట్‌వర్క్, 14 వేల కిలోమీటర్ల సీవరేజ్ నెట్‌వర్క్, 6 లక్షలకుపైగా మ్యాన్‌హోల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో జరిగిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఉచిత నీటి సరఫరా అమలుపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని అర్హులైన వినియోగదారులకు 20 KL ఉచిత నీటి సరఫరా పథకం కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో మొత్తం 6.22 లక్షలకు పైగా వినియోగదారులు ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నట్లు తెలిపారు.

ట్యాంకర్ల డిమాండ్..

భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్యాంకర్ నీటి డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. దీనికి అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను 86 నుంచి 96కు, ఫిల్లింగ్ పాయింట్లను 141 నుండి 167కు పెంచినట్లు తెలిపారు. ట్యాంకర్ల సంఖ్యను కూడా 1135 నుండి 1250కు పెంచినట్లు అధికారులు వివరించారు. జల ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా వేగంగా స్పందిస్తున్నామని, ముఖ్యంగా ట్యాంకర్ సేవలకు సంబంధించిన ఫిర్యాదుల్లో 95 శాతం 24 గంటల్లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 400 ఫ్రీ టాంకర్ లు సరఫరా చేస్తున్నామని అన్నారు.

వర్షాకాల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి..

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. నగరంలోని నీటిమునిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణను సమర్థంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 2025 లో 2916 కిలోమీటర్ల మేర సీవర్ లైన్ల డీ-సిల్టింగ్ చేపట్టినట్లు, 2.81 లక్షల మాన్‌హోల్స్ శుభ్రపరిచినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ శుభ్రత, మ్యాన్‌హోల్ క్లియరెన్స్, సిల్టింగ్ తొలగింపు, ట్రంక్ సీవరేజ్ లైన్‌ల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, సమస్యలను సమయానికి పరిష్కరించాలని సూచించారు. నగర విస్తరణతో పాటు తాగునీటి, సీవరేజ్ సేవలపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకు అనుగుణంగా పైప్‌లైన్‌లు, స్టోరేజ్ పాయింట్లు, పంపిణీ వ్యవస్థలు, సీవరేజ్ నెట్‌వర్క్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ఇంకుడు గుంతల్లేకుంటే చర్యలు..

భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత సంవత్సరం చేపట్టిన “ప్రతి ఇంటా ఇంకుడు గుంత” కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ సాధ్యమవుతుందని, ప్రతి ఇంటిలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వాటర్ హార్వెస్టింగ్ లేని ప్రాంతాల్లో ట్యాంకర్ సేవలపై ప్రత్యేక విధానాలు అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు.

నియామకాలపై..

జలమండలి సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకాలు, మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రత్యేక నిధుల కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన తాగునీటి, సీవరేజ్ సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమగ్ర నివేదికలను మంత్రికి సమర్పించారు. సమీక్షలో భాగంగా ట్యాంకర్ కార్యకలాపాల ప్రస్తుత పరిస్థితిపై అయన వివరించారు. భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్యాంకర్ నీటి డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. నగరంలో కొనసాగుతున్న నీటి సరఫరా మరియు మౌలిక వసతుల పనుల పురోగతిని కూడా మంత్రికి వివరించారు. ఓఆర్ఆర్ పరిధిలో అమృత్-2 పథకం కింద చేపట్టిన 39 ఎస్టీపీల నిర్మాణ పనులు, ప్యాకేజీ-1 కింద 16 ఎస్టీపీలు, ప్యాకేజీ-2 కింద 22 ఎస్టీపీల పనుల పురోగతిపై వివరాలు అందించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఈడీలు సంతోష్, సామ్రాట్ అశోక్, డైరెక్టర్‌ టెక్నికల్ సుదర్శన్, డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస్ రెడ్డితో పాటు సీజీఎంలు, జీఎంలు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story