- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: తాత ముత్తాతలు నుంచి వినియోగించే స్మశాన వాటిక కబ్జా
స్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడంలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడంలేదు. తాత ముత్తాతలు నుంచి వినియోగించే స్మశాన వాటికను ఇంటి స్థలాలుగా మార్చేసి కబ్జాలు చేస్తున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి పాత నేరేడ్‌మెట్ న్యూ విద్యానగర్ కాలనీ సర్వేనంబరు 153/1 లో గల 7 గుంటల స్థలం మండల రెవెన్యూ రికార్డుల ప్రకారం స్మశానవాటికగా నమోదైంది. దీనిని ఇంటి స్థలంగా పేర్కొంటూ కబ్జా చేస్తున్నారని.. వెంటనే కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో నేరేడ్‌మెట్ ముదిరాజ్ సంఘం విజ్ఞప్తి చేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గ్రామంలోని సర్వే నంబరు 148 - 155 సర్వే నంబర్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమి మొగుల్ల చెరువు బఫర్‌లో ఉన్న 23 గంటల స్థలం కబ్జాలను ఆపాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
శేరిలింగంపల్లి మండలంలోని గోపన్నపల్లిలో 6.18 ఎకరాల్లో వసుంధర ఎస్టేట్స్ పేరిట 1999లో లే ఔట్ వేయగా.. ఇందులోని 2.10 ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మళ్లీ అమ్మేశారని.. పాత లే ఔట్ ప్రకారం అందులోని రహదారులు, పార్కులు కాపాడి.. ఆ లే ఔట్‌కు జీవం పోయాలని పలువురు హైడ్రాను కోరారు. అత్తాపూర్ సమీపంలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో కొందరు వ్యక్తులు మూసీ నదిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారని.. రోజుకు సుమారు 50 ట్రక్కుల చెత్తను అక్కడ పోసి చదును చేస్తున్నారని అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖకు చెందిన భూమిని నకిలీ క్లెయిమ్‌లు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. కుకట్‌పల్లి గ్రామం, బాలానగర్ మండల పరిధిలో ఉన్న సుమారు 59 ఎకరాలు 6 గుంటల విలువైన భూమి (దాదాపు ₹6,000 కోట్లు)పై తప్పుడు పత్రాలతో హక్కులు క్లైమ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులందగా.. వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.






