ఫ్యూచర్ సిటీలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 500 ఎకరాలు.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రోడ్లు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కావని, అవి రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు పునాదులని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 500 ఎకరాలు.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కావని, అవి రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు పునాదులని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో తమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. మెరుగైన రోడ్లతో రైతులకు మార్కెట్ సదుపాయం, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబడతాయని మంత్రి పేర్కొన్నారు.

రహదారుల రూపురేఖలు మార్పు

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)ను అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ విధానం కింద 12,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఫేజ్-1లో సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 6,092 కి.మీ రోడ్ల పనులను చేపడుతున్నట్లు తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి, 15 ఏళ్ల పాటు పటిష్టమైన నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 27 నెలల్లో వేల కోట్ల రూపాయలతో వందల కిలోమీటర్ల రోడ్లు, డజన్ల కొద్దీ వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు.

గేమ్ ఛేంజర్‌గా మెగా ప్రాజెక్టులు..

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్-విజయవాడ 6 లేన్ల విస్తరణ, అమరావతి-బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చేయనున్నాయని మంత్రి చెప్పారు. చెన్నై, పుణే, బెంగళూరు తదితర నగరాలను కలుపుతూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీనికోసం శంషాబాద్ సమీపంలోని ‘ఫ్యూచర్ సిటీ’లో 500 ఎకరాలను కేంద్ర బిందువుగా (సెంటర్ పాయింట్) ప్రభుత్వం కేటాయించనుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

వేగంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు

దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సగటున రోజుకు 18 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోతుండటం, అందులోనూ యువతే ఎక్కువగా ఉండటం విచారకరమన్నారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని చేపట్టామని, సురక్షిత ప్రయాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన వైద్య, మౌలిక వసతులు కల్పించే దిశగా ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నలువైపులా రూ. 8 వేల కోట్లతో నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ ఆస్పత్రుల్లో.. సనత్‌నగర్‌లో రూ.2 వేల కోట్లతో చేపట్టిన టిమ్స్ పనులు జూన్ నాటికి ప్రారంభ దశ పూర్తవుతుందని తెలిపారు. అలాగే ఉస్మానియా కొత్త ఆసుపత్రి, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ‘మంచి రోడ్డు అంటే ఆర్థిక అభివృద్ధి, సురక్షిత జీవితం, ప్రజల భవిష్యత్తు’ అని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Next Story