- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు
పాత లే ఔట్లను చెరిపేసి తమ ప్లాట్లతో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జాచేసేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో : పాత లే ఔట్లను చెరిపేసి తమ ప్లాట్లతో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జాచేసేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 1980 - 1990 సంవత్సరాల కాలంలో వేసిన లే ఔట్లు మాయం చేసి.. భూమినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులందాయి. ఇందులో ఎక్కువగా నగర శివార్లలోని లే ఔట్లకు సంబంధించినవి ఉన్నాయి. భూములకు ధరలు పెరగడంతో.. గతంలో తమకు అమ్మినవారే కొన్ని చోట్ల కబ్జాలు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పంచాయతీ లే ఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి.. సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదులందాయి.
ఫిర్యాదులు ఇలా..
*రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదుర్‌గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేయగా.. 2024 వచ్చేసరికి అందులో 30 ఎకరాల మేర కబ్జాకు గురైందని పలువురు ఫిర్యాదు చేశారు. ఆ లే ఔట్లోని పార్కులు, రహదారులు కూడా కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
*రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 58, 59లో ఉన్న ఎన్ ఎం ఆర్ - దివ్యానగర్ లే ఔట్‌లో తాము ప్లాట్లు కొనగా... ఇప్పుడవి కనిపించడంలేదని పలువురు ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని.. ఇప్పుడక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ఇందులో పార్కులు, రహదారులు కూడా ఉన్నాయని.. ఈ లే ఔట్‌ను కాపాడాలని పలువురు కోరారు.
*గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్‌జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములను కొంతమంది టీఎన్‌జీవో ప్రతినిధులుగా పేర్కొని 8 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని టీఎన్‌జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
* మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నంబరు 7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని.. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
వెంటనే పరిష్కారం
ప్రజావాణిలోనే కొన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కరించారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను పరిశీలించి.. సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదులను అందజేసి.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు.






