హైడ్రా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 17:06:04  IST  )

కోర్టు ఆదేశాలున్నా బేఖాత‌రు చేస్తున్నారు... చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నారు... నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

హైడ్రా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు ఆదేశాలున్నా బేఖాత‌రు చేస్తున్నారు... చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నారు... నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ప్లాట్‌కు ప‌క్క‌న రోడ్డున్నా.. పార్కున్నా.. క‌లిపేసుకుంటున్నార‌ని వాపోతున్నారు. కోర్టు స్టేట‌స్ కో ఉన్నా.. గ‌చ్చ‌బౌలిలో సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర్ రావు ప‌లు నిర్మాణాలు చేప‌డుతున్నారంటూ.. ఫెర్టిలైజ‌ర్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప‌లువురు ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. లే ఔట్ నామ‌రూపాలు లేకుండా చేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేప‌డుతున్నారంటూ వాపోయారు. ఎక్క‌డా ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని హైకోర్టు ఉత్త‌ర్వులున్నా.. నిర్మాణాలు య‌థేచ్ఛ‌గా కొన‌సాగిస్తున్నారంటూ ప్లాట్ య‌జ‌మానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో త‌మ‌కు అనుమతులున్నా నిర్మాణాలు చేయ‌డానికి వీలు లేద‌ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మౌతున్నాయ‌ని వాపోయారు. ర‌హ‌దారులు ఇష్టానుసారం నిర్మించుకుని త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాప్రా జ‌వ‌హార్‌న‌గ‌ర్ స‌రిహ‌ద్దుల‌లో లే ఔట్ వేసి.. 33 అడుగుల రోడ్డును ఆక్ర‌మించేశార‌ని ఫిర్యాదు చేశారు. ఇలా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు రాగా.. పార్కులు, ర‌హ‌దారుల‌ ఆక్ర‌మ‌ణ‌లే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. వీటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ప‌రిశీలించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

- రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండలంలోని గోప‌న్న‌ప‌ల్లి గ్రామంలో సర్వే నంబర్ 178లో ఉన్న ప్రభుత్వ భూమి, చిన్నిపెద్ద చెరువు పరిధిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అని బ్రిక్స్ స్కైవుడ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేసారు . 2023 డిసెంబర్ 17న హమీద్ అనే వ్యక్తి ప్ర‌భుత్వం నిర్మించిన ప్ర‌హ‌రీని కూల్చేసి.. చెట్ల‌ను న‌రికి చ‌దును చేసి ఆక్ర‌మించేశాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్క‌లు నాటినా ఆక్ర‌మ‌ణ‌లు ఆగ‌లేద‌ని.. ప్రభుత్వ భూమిని రక్షించాలని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో పేర్కొన్నారు.

- మేడ్చ‌ల్ జిల్లా కీసర మండలంలోని నాగారం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారాయన్ చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని అన్నారాయన్ చెరువు పరి రక్షణ సమితి హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేసింది. నిర్మాణ వ్య‌ర్థాల‌ను వేసి చెరువును మ‌ట్టితో నింపేస్తున్నార‌ని ప‌రిర‌క్ష‌ణ స‌మితి ప్ర‌తినిధులు పేర్కొన్నారు. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి చెరువుల్లో ఎలాంటి డంపింగ్ కార్యకలాపాలు చేయరాదని తెలిపినా వ్యర్థాలు వేయడం కొనసాగుతోంది అని ఫిర్యాదు చేశారు. పర్యావరణానికి, జల వనరులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున హైడ్రా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

- బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 12లోని ఎమ్మెల్యే కాల‌నీలో రెండు ప్లాట్ల మ‌ధ్య 100 గ‌జాల వ‌ర‌కూ ప్ర‌భుత్వ స్థ‌లం ఉంటే.. ఇరువైపుల వారు దానిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో ఒక‌రు క‌బ్జాచేసిన‌ది రెగ్యుల‌రైజేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఇంకొక‌రు.. ఎలాంటి ద‌ర‌ఖాస్తు చేసుకోకుండా.. 70గ‌జాల‌కు పైగా క‌బ్జా చేసేస్తున్నార‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. తాను ఎల్ ఆర్ ఎస్ చెల్లించ‌గా.. త‌న ద‌ర‌ఖాస్తు ఎమ్మార్వో కార్యాయంలో పెండింగులో ఉండ‌గా.. ప‌క్క‌న ఉన్న ప్లాట్ య‌జ‌మాని నేరుగా క‌బ్జా చేయ‌డ‌మే కాకుండా.. రూం కూడా నిర్మించేస్తున్నార‌ని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.

- షేక్‌పేట‌లోని స‌క్కుబాయి న‌గ‌ర్ లే ఔట్ మొత్తం 25 ఎక‌రాలు. ఇందులో మొఓత్తం 249 ప్లాట్లున్నాయి. 16,158 గ‌జాల‌ను ప్ర‌జావ‌స‌రాల‌కోసం కేటాయించారు. ఇదే లే ఔట్‌ను రివైజ్ చేశారు. 2022లో ఇష్టానుసారం పార్కులు, ర‌హ‌దారులు క‌బ్జాచేసేసి ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ప్లాట్లుగా మార్చేశారంటూ స‌క్కుబాయి న‌గ‌ర్ నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదుచేశారు. 2022లో రివైజ్ చేసి ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను 13282 గ‌జాల‌కు త‌గ్గించేశార‌ని నివాసితులు ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత లే ఔట్ ప్ర‌కారం 16 వేల గ‌జాలుండేలా చూడాల‌ని కోరారు.

-బేగంపేట, భ‌గ‌వంత్‌పురం ప్రాంతంలోని విమానాశ్ర‌యం నుంచి వ‌స్తున్న వ‌ర‌ద కాలువ‌ను ఓ వ్య‌క్తి ఆక్ర‌మించి మ‌ట్టితో నింపుతున్నార‌ని.. దీంతో భ‌గ‌వంత్‌పురంలో నివాసాలు వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నీట మునుగుతున్నాయ‌ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story