42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరం.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

42 రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు.

42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరం.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 42 రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయాలని నిర్ణయించామని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. ఎవరి నోటికాడ ముద్ద లాక్కోవడం లేదన్నారు. వాస్తవానికి బీసీ రిజర్వేషన్లలో ఇంకా వాటా రావాలి కానీ కుదించుకుని 42 శాతమే అడుగుతున్నాం అన్నారు. పార్టీ మెప్పు కోసం, అగ్ర నాయకుల మెప్పు కోసం బీసీ రిజర్వేషన్లపై మాట్లాడి సమాజంలో తలవంపులు తెచ్చుకోవద్దు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడులో జయలలిత (Jaya Lalitha) బీసీ రిజర్వేషన్లను పెంచి షెడ్యూల్-9‌లో పెట్టినప్పుడు ఆమె పార్టీ కేంద్రంలో అధికారంలో లేదని గుర్తు చేశారు. ప్రజాభీష్టం మేరకు కేంద్రం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము బీసీ రిజర్వేషన్ బిల్లును చట్ట సభల్లో ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపామని.. కానీ, ఆ బిల్లును ఆమోదించకుండా తమపై బీజేపీ నేతలు బట్ట కాల్చి మీద వేయడం సమంజసం కాదని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురికావొద్దని వాకిటి శ్రీహరి బీజేపీకి హితవు పలికారు.

Next Story