HYDRA: కళ్ల ముందే కబ్జాలు.. ఇక మౌనం కాదు! హైడ్రా ప్రజావాణిలో 36 ఫిర్యాదులు

by Ramesh Naini |

పార్కులు, ర‌హ‌దారులు, చెరువులు.. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జా విష‌యంలో ఫిర్యాదు చేయ‌డానికి సామాన్యులు కూడా వెనుకాడ‌డంలేదు.

HYDRA: కళ్ల ముందే కబ్జాలు.. ఇక మౌనం కాదు! హైడ్రా ప్రజావాణిలో 36 ఫిర్యాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్కులు, ర‌హ‌దారులు, చెరువులు.. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జా విష‌యంలో ఫిర్యాదు చేయ‌డానికి సామాన్యులు కూడా వెనుకాడ‌డంలేదు. అర్థ‌బ‌లం, రాజ‌కీయ అండ‌దండ‌లున్న‌వార‌ని మ‌న‌కెందుకు అనుకోవ‌డంలేదు. పార్కులు క‌బ్జా అవుతున్నా.. తామెళ్లేందుకు వీలు లేకుండా ర‌హ‌దారులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్నా ఊరుకోవ‌డంలేదు. ఇక మౌనం సరికాదని సోమ‌వారం (HYDRA) హైడ్రా ప్ర‌జావాణిలో మొత్తం 36 ఫిర్యాదులు అందాయి. పార్కు స్థ‌లాన్ని ఇష్టానుసారం వినియోగిస్తున్నార‌ని.. చెరువుల్లోకి మురుగు నీరు చేర‌డంతో త‌మ నివాసాలు ముంపున‌కు గురౌతున్నాయ‌ని ఫిర్యాదులందాయి. ర‌హ‌దారులు, పార్కులు క‌బ్జా కాకుండా చూడాల‌ని ప‌లువురు ఫిర్యాదులు అంద‌జేశారు. నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాలున్నాయ‌ని, విద్యుత్ హై టెన్ష‌న్ వైర్ల కింద కూడా నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌లువురు పేర్కొన్నారు. త‌మ ఇంటికి దారి బంద్ చేశామ‌ని ఒక‌రు, రోడ్డును ఆక్ర‌మించేశార‌ని మ‌రొక‌రు ఫిర్యాదులు చేశారు. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌ళ్ల ముందే క‌బ్జాల‌కు గురి అవుతున్నాయ‌ని వాపోయారు. ఇలా వ‌చ్చిన ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ (A.V. Ranganath) ప‌రిశీలించారు. ఫిర్యాదుదారుల స‌మ‌క్షంలోనే గ‌తంలో ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో గూగుల్‌, శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా వివ‌రించి.. సంబంధిత అధికారుల‌కు ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా..

  • ప‌టాన్‌చెరులోని ఏపీఆర్ ప్ర‌వీణ్ ల‌గ్జారియాలోని పార్కు స్థ‌లంలో రాత్రికి రాత్రి గుడి క‌ట్టేస్తున్నారంటూ హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఇదేమ‌ని అడిగితే దాడికి దిగార‌ని వాపోయారు. దాదాపు 39 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న లే ఔట్‌లో 500ల వ‌ర‌కూ విల్లాలుండ‌గా.. ఇందులోని పార్కుకు కేటాయించిన స్థ‌లంలో గుడి క‌డుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారంలోని చిన్న బంధం చెరువును ఇరువైపుల నుంచి క‌బ్జాలు చేసేస్తున్నార‌ని.. చెరువులోని నీళ్ల‌న్నీ కింద‌కు వ‌దిలేస్తున్నార‌ని గాజుల‌రామారం వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుచేశారు. చెరువు వాస్త‌వ విస్తీర్ణం ఎంత‌నేది నిర్ణ‌యించి ఫెన్సింగ్ వేయాల‌ని కోరారు. ఇప్పుడే నీల్ల‌న్నీ కింద‌కు వ‌దిలేస్తే.. వేస‌విలో భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటి బోర్లు ఎండిపోతాయ‌ని వాపోయారు.
  • రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం బండ్ల‌గూడ విలేజ్‌లోని పీ అండ్ టీ కాల‌నీలో అర ఎక‌రం పార్కు క‌బ్జాకు గురి అవుతోంద‌ని ఆకాల‌నీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీలోని గండిపేట మండ‌లం గంధంగూడ గ్రామంలోని 3.28 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురి అవుతోంద‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు.
  • మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా మాచ బొల్లారం గ్రామంలోని ముతుకుల కుంట నీటి విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతోంద‌ని.. 4.62 ఎక‌రాల చెరువు కాస్త 12 ఎక‌రాలు దాటిపోయింద‌ని అక్కడి నివాసితులు వాపోయారు. తూములు బంద్ చేసి, అలుగును కూడా పెంచేశారంటూ ప్ర‌జావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమ‌తి పొందిన లే ఔట్‌లు నీట మునుగుతున్నాయ‌ని వాపోయారు.
Next Story