- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్‌లో 226 సమస్యత్మక పోలీంగ్ కేంద్రాలు
అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున, ఈ ఎన్నికల్లో 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో డ్రోన్‌ల ద్వారా నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
మొత్తం 139 పోలింగ్ స్టేషన్‌లలో 407 పోలింగ్ కేంద్రాల్లో ఉప ఎన్నికను నిర్వహించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామన్నారు. ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేసే సమయాన్ని పెంచామని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 లోపు పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంను డీఆర్సీ సెంటర్గా ఏర్పాటు చేశామని, అక్కడ మూడంచెల భద్రత ఉంటుందని అన్నారు. రెగ్యులర్ ప్రచారం ముగిసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు.
139 ప్రాంతాలలో డ్రోన్‌లతో నిఘా
పోలింగ్ కేంద్రాలున్న 139 ప్రాంతాల్లో ఒక్కో డ్రోన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెడుతున్నామని కర్ణన్ వెల్లడించారు. డ్రోన్లతో పోలింగ్ కేంద్రాల వెలుపలి పరిస్థితలను పర్యవేక్షిస్తమని తెలిపారు. వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ కేంద్రం లోపలి పరిస్థితిని ఉదయం 6 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు రికార్డు చేస్తామన్నారు. వీడియో ఫుటేజిలను జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ పరిశీలిస్తుంటుందని, ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. 103 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
8 కంపెనీల పారామిలిటరీ బలగాలతో బందోబస్తు..
ఎన్నికల బందోబస్తు కోసం 1,761 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించినట్లు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటివరకు రూ. 3 కోట్ల 50 వేల పైగా నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపడంతో రూ.2.11కోట్లు నగదు తిరిగి విడుదల చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 27 ఎంసీసీ కేసులు, 2,600 వివిధ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 230 మంది రౌడీ షీటర్‌లను బైండోవర్ చేసినట్టు జాయింట్ సీపీ తెలిపారు. ప్రచారం ముగియడంతో, నియోజకవర్గంలో ఉన్న స్థానికేతరులను తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆదివారం సాయంత్రం నుంచి నవంబర్ 11 సాయంత్రం వరకు నియోజకవర్గ పరిధిలో వైన్స్ షాపులు మూసివేస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. తిరిగి నవంబర్ 14న ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.






