రెండు రోజుల్లో 21.325 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రెండు రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రెండు రోజుల్లో 21.325 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. RFCL లో యూరియా ఉత్పత్తి ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం, యూరియా సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రానున్న రెండు రోజులలో రాష్ట్రానికి IFFCO-Phulpur, NFL, MCFL, KRIBHCO, CIL, PPL కంపెనీల నుంచి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదన్నారు. ఈ యూరియా రాష్ట్రంలోని గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకుటుందని, అక్కడి నుంచి డిమాండ్ పరంగా ఆయా జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలోగా IPL, CIL కంపెనీల నుంచి దామ్ర, గంగవరం, కరాయికల్ పోర్టుల ద్వారా మరో 27,950 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, ఆ యూరియా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వేల్, జగిత్యాల, నాగిరెడ్డిపల్లి ప్రాంతాలకు చేరుకోనుందని అన్నారు. అనంతరం వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

కేంద్ర మంత్రి నడ్డాకి లేఖ

వచ్చే నెలలో రైతుల అవసరాలను తీర్చేందుకు తక్షణం అదనపు యూరియా కేటాయింపులు చేయాలని, కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ ద్వారా మంత్రి తుమ్మల కోరారు. వరి పంటకు మొదటి, రెండవ విడతల యూరియా వేయడం జరుగుతోందని, త్వరలో మూడవ విడతతో పాటు ఎం.ఓ.పీ. వాడకం కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం వరి పంటకే సెప్టెంబర్ నెలలో 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని వివరించారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రాష్ట్రానికి 2.38 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని తెలిపారు. ఈ లోటు రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూరియా స్టాక్ కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమేనని, రోజుకు 9,000 నుండి 11,000 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ఎరువుల శాఖ (DoF) రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని, అలాగే సెప్టెంబర్ నెలకు ఇప్పటికే ఆమోదించిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకు తోడుగా ఈ అదనపు కేటాయింపును మంజూరు చేయాలని మంత్రి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాక, కాకినాడ పోర్టుకు చేరనున్న OBE LOTUS నౌకలోని 47,500 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకి చేరనున్న రెండు నౌకల (MV AM OCEAN Freight – 45,000 MTs, Magda – 44,000 MTs) నుండి 20,000 మెట్రిక్ టన్నుల యూరియా చొప్పున రాష్ట్రానికి మంజూరు చేయాలని అభ్యర్థించారు.

పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని అన్నారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను మంత్రి అప్రమత్తం చేశారు. జిల్లాలలోని రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులపై ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగి వాగులు, కల్వర్టుల దగ్గర నీటి ప్రవాహాం పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు

Next Story