- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
5 జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో.. 1500 మంది విద్యావాలంటీర్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా బోధించే టీచర్లు లేక పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా బోధించే టీచర్లు లేక పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని పాఠశాల విద్యా శాఖ గుర్తించగా, అదే సమయంలో స్టేట్‌లోని ఐదు జిల్లాల్లో మాత్రం టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీచర్ల కొరతను అధిగమించేందుకు సుమారు 1,500 మంది విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
ప్రస్తుతానికి రెగ్యులర్ టీచర్ల నియామకం సాధ్యం కాదని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపదికన వీరిని నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో విద్యా వాలంటీర్‌కు ప్రతి నెలా రూ.16 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ఈ రిక్రూర్‌మెంట్ కోసం సంవత్సరానికి సుమారు రూ.14 కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
డిప్యుటేషన్లు, బదిలీలతో ఉపాధ్యాయుల కొరత..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరతకు గల కారణాలపై విద్యాశాఖ అధికారులు విశ్లేషించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇతర గ్రామీణ జిల్లాల నుంచి, అదే విధంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సైతం అనేక కుటుంబాలు ఈ జిల్లాలకు వలస రావడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక గద్వాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు డిప్యూటేషన్లు, స్పౌజ్ కేటగిరీ సహా ఇతర బదిలీల కింద వెళ్లిపోవడంతో టీచర్ల కొరత ఏర్పడింది. గద్వాల జిల్లాలో 244 మంది, నారాయణపేట్‌లో 320, వికారాబాద్‌లో 123, మేడ్చల్‌లో 520, రంగారెడ్డి జిల్లాల్లో 221 మంది చొప్పున మొత్తం 1,428 మంది విద్యా వాలంటీర్లు అవసరమని అధికారులు గుర్తించారు.
10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు!
తెలంగాణలోని పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 24 వేల పాఠశాలలుండగా, అందులో 1.8 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8,600 చోట్ల నిబంధనల ప్రకారం అవసరమైన వారి కంటే ఎక్కువగా ఉన్నారని, సుమారు మూడు వేల స్కూళ్లలో తక్కువ మంది ఉన్నారని గుర్తించారు. ఎక్కువ మంది ఉన్న చోటు నుంచి టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తే 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉంటారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 24,238 ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 15 చోట్ల మాత్రమే వెయ్యికి మించి విద్యార్థులున్నారు. మూడు వేలకు పైగా ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలున్నాయి. ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలలు 55 ఉండగా, 10 మంది లోపు స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ 4,325 ఉన్నాయి.
వాలంటీర్లు లేక ఇబ్బందులు..
విద్యా సామర్థ్యాలు పడిపోకుండా బోధన అందించాలనే లక్ష్యంతో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా జిల్లాలో సేవలు అందించారు. ఈ జిల్లాలోని రాజోలి ప్రాథమిక పాఠశాలలో 202 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. తరగతుల వారీగా బోధన చేసే పరిస్థితి లేక రెండు మూడు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఈ జిల్లాలో ఎంవీ ఫౌండేషన్ ద్వారా 35 మందికి పైగా వాలంటీర్లు స్కూళ్లలో బోధించేవారు. జిల్లాలో ఎంవీఎఫ్ సేవలు నిలిచిపోవడంతో వీరంతా ఆగస్టు నుంచి బోధన నిలిపేశారు. ఫలితంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది. గట్టు మండలం అరగిద్ద ఉన్నత పాఠశాలలో 262 మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. ఇక్కడ మరో ఐదుగురు అవసరం ఉండటంతో సబ్జెక్టు పాఠాలు బోధించే వారు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఈ ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికంగానే ఉంది.






