సాదాబైనామాకు తప్పని తిప్పలు..! అభ్యంతరాలు లేవనెత్తితే అప్లికేషన్లు రిజెక్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 03:21:19  IST  )

రాష్ట్రంలో భూ సంస్కరణలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గత సర్కారు పెండింగులో ఉంచిన సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సాదాబైనామాకు తప్పని తిప్పలు..! అభ్యంతరాలు లేవనెత్తితే అప్లికేషన్లు రిజెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సంస్కరణలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గత సర్కారు పెండింగులో ఉంచిన సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూభారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరణ పవర్స్‌ను అధికారులకు కట్టబెట్టింది. దీంతో 9 లక్షల కుటుంబాలకు ఊరట కలగనుంది. అయితే ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. ఈ కొనుగోళ్ల సమయానికి, ప్రస్తుతానికి భూముల ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో ఎకరం రూ.వేలల్లో ఉంటే.. ఇప్పుడు రూ.లక్షలు.. కోట్లు పలుకుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో 13బీ సర్టిఫికెట్ జారీ కోసం అమ్మిన వ్యక్తి సమ్మతిస్తూ సంతకం పెట్టాలనే నిబంధనతో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. సేల్ డీడ్స్ ద్వారా తండ్రులు అమ్మేసిన భూములపైనే వారసులు కొట్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సాదాబైనామా రెగ్యులరైజేషన్ విచారణ సమయంలో అమ్మిన వ్యక్తుల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ‘సమ్మతి’ దొరకడం కష్టమేనని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసలు ఈ సాదాబైనామాలు ఒరిజినలా, నకిలీవా? అన్నది కూడా డౌటేనని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మేసిన వ్యక్తుల సమ్మతి అనివార్యమైతే.. 10 శాతం కూడా రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అభ్యంతరాలు వస్తే రిజెక్ట్

పట్టా చేయాలంటే భూమి అమ్మిన వ్యక్తులు లేదా వారసుల సమ్మతి అవసరం. ఒకవేళ సాదాబైనామా క్రమబద్ధీకరణకు వారు తగిన కారణాలు, ఆధారాలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దరఖాస్తును తిరస్కరిస్తారు. అయితే భూమి అమ్మిన వ్యక్తి నోటీసులు తీసుకొని.. ఇచ్చిన గడువులోగా అభ్యంతరాలు వ్యక్తం చేసి, దాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. 13బీ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత అభ్యంతరం వ్యక్తం చేయాలంటే.. అప్పీల్‌కు వెళ్లాలి. అమ్మిన వ్యక్తికి వారసులు లేకున్నా.. వారి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేసినా, అమ్మలేదని రుజువు చేసినా దరఖాస్తులను తిరస్కరించే చాన్స్ ఉంది. సాదాబైనామాలో ఒక సర్వే నంబరు, స్వాధీనంలో మరొక సర్వే నంబరు ఉంటే తిరస్కరించే అధికారం సైతం ఉన్నది. 2016 జూన్ 14న సాదాబైనామాల ద్వారా రికార్డు ఆఫ్ రైట్స్ ఫామ్ 10 క్లెయిమ్ చేసేందుకు స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ జీవో నం.158ని జారీ చేశారు. అప్పుడు పైసా కట్టకుండానే రెగ్యులరైజేషన్ చేశారు. ఇప్పుడు మాత్రం స్టాంప్ డ్యూటీ అందరూ కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పన్నెండేండ్ల పాటు కాస్తులో ఉన్నట్లు పంచనామాలో తేలాలి.

క్రమబద్ధీకరణ విధానం ఇలా..

– సాదాబైనామా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని 2014 జూన్ 2వ తేదీ లోపు కొనుగోలు చేసి, సాగులో చిన్న, సన్నకారు రైతుగా ఉండాలి. గతంలోనే మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసి ఉండాలి.

– దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు నకలు, కొనుగోలు చేసిన రిజిస్టర్ కాని, క్రయ విక్రయ దస్తావేజు(సాదాబైనామా) నకలు, భూమి కొనుగోలు చేసినట్లుగా, సాగులో ఉన్నట్లుగా ఆధారాలు జత చేసి ఉండాలి.

– భూమి అమ్మిన వ్యక్తికి ఏ రోజు, ఏ సమయంలో విచారణ చేస్తారో తెలుపుతూ తహశీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన సంబంధిత వ్యక్తులు కూడా విచారణలో పాల్గొనవచ్చు.

– నిర్దేశించిన రోజున రెవెన్యూ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి గ్రామంలో విచారణ చేపడుతారు. ఇందులో సాదాబైనామా పత్రాన్ని, పహానీ, ఆర్వోఆర్ రికార్డులను పరిశీలిస్తారు. భూమి విస్తీర్ణం, హద్దుల వివరాలను తెలుసుకుంటారు. దరఖాస్తుదారు సాగులో ఉన్న విషయాన్ని నిర్ధారించుకుంటారు.

– క్షేత్ర పరిశీలన నివేదికను విచారణ సమయంలో రాసుకుంటారు. ఆ రిపోర్టును, దరఖాస్తుతో సమర్పించిన పత్రాలను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

– దరఖాస్తుదారుడి కొనుగోలు వాస్తవమేనని తేలితే 13బీ సర్టిఫికెట్‌ను ఆర్డీవో జారీ చేస్తారు.

– దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలు తెలుపుతూ ఎండార్స్‌మెంట్ ఇస్తారు.

– తహశీల్దార్ జాయింట్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నందున అప్పటికప్పుడు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడం సులువు అవుతుంది.

– 13 బీ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత ఆర్వోఆర్ 1, 1 బీలో తగిన మార్పులు చేస్తారు. ఫారం-17 రిజిస్టరులో నమోదు చేస్తారు. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు.

– అయితే ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో నిబంధనల్లో చెప్పలేదు. తహశీల్దార్ ఇచ్చిన తీర్పుపై ఏమైనా అప్పీల్‌కు వెళ్లేందుకు దరఖాస్తుదారుడికి హక్కులు ఉన్నాయి. కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. సాదాబైనామా నకిలీవని తేలినా తిరస్కరిస్తారు.

పరిశీలించే అంశాలు ఇవి..

– దరఖాస్తుదారుడి పేరు, అమ్మిన వ్యక్తి వివరాలన్నింటినీ చెక్ చేస్తారు.

– భూమి పూర్తి వివరాలు, భూమి స్వభావం, సరిహద్దులు, పహానీలు, క్రమబద్ధీకరణకు 12 చట్టాల పరిధిలో ఉందా/లేదా? అని చూస్తారు.

– ఇలా మొత్తం 27 అంశాలతో కూడిన రిపోర్టును రూపొందిస్తారు.

– దరఖాస్తుల పరిశీలనలో 26 అంశాలను పరిశీలిస్తారు.

షరతులు ఇలా..

– గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే సాదాబైనామాల క్రమబద్ధీకరణ వర్తించనుంది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెల్లవు.

– స్టాంప్ డ్యూటీ ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది.

– కొత్తగా అప్లయ్ చేసుకునే అవకాశం లేదు. గతంలో పెండింగులో ఉన్న అప్లికేషన్ల వరకే అవకాశం.

– భూ భారతి సెక్షన్-6 ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీరణ రెగ్యులరైజేషన్ బాధ్యతలను ఆర్డీవోలకు కట్టబెట్టారు. నోటీసులు జారీ చేసి విచారణ చేపడతారు. 90 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

భూ భారతితో చట్టం వల్లే..

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2021 అక్టోబర్ 18న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో-112ను విడుదల చేసింది. అక్టోబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా.. 2,26,693 అప్లికేషన్లు వచ్చాయి. మళ్లీ గడువును నవంబర్ 10వ వరకు పెంచగా.. మరో 6,74,201 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ కోసం మొత్తం 9,00,894 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2020 అక్టోబ‌ర్ 30న ధరణి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ర‌ద్దయిన‌ ఆర్వోఆర్ చట్టం ప్రకారం సాదాబైనామాల దరఖాస్తులను ఎలా స్వీకరిస్తార‌ని, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ పిల్‌పై విచార‌ణ చేసిన హైకోర్టు 2020 అక్టోబర్ 29వ తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 29వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి 13-బీ పత్రాలను జారీ చేయవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. తాజాగా తెలంగాణ రికార్డు ఆఫ్ రైట్ ప్రకారం మొత్తం దరఖాస్తులను పరిశీలించి, సాదాబైనామాలను క్రమబద్ధీకరించవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇది భూ భారతి చట్టం అమల్లోకి రావడం వల్లే సాధ్యమైంది.

అడ్డుకుంటున్న ఐఏఎస్ అధికారులు

భూ భారతి చట్టం రూపకల్పన సందర్భంలోనూ కొందరు ఐఏఎస్ అధికారులు పెండింగ్ సాదాబైనామాల పరిష్కారంపై పేచీ పెట్టారు. అధికారంలోకి వస్తే వీటిని పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పట్టుబట్టారు. దాంతో ఆర్వోఆర్-2025లో అధికారాలను కట్టబెట్టారు. అయితే భూ భారతి అమలైన తర్వాత కూడా కోర్టు స్టే వెకేట్ చేయించడంలో తాత్సారం వెనుక ఆ ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నది. రెవెన్యూ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వాటి కంటే అధికంగా సాదాబైనామా పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. పరిష్కరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ఆదరణ వస్తుంది. భూ భారతి చట్టం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన భూమి సునీల్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి పలుమార్లు ప్రభుత్వం మీద తెచ్చిన ఒత్తిడి కారణంగానే నేడు దరఖాస్తుల పరిశీలన వరకు ప్రక్రియ వచ్చినట్లు చర్చ జరుగుతున్నది.

Next Story