- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 1,239 కి.మీల రహదారులు ధ్వంసం
రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జీలకు భారీ నష్టం వాటిల్లింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జీలకు భారీ నష్టం వాటిల్లింది. రహదారులకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వరద తాకిడికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు, కాజ్ వేలు కోతకు గురయ్యాయి. దాదాపు 1,239 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేశారు. 300 చోట్లలో సీడీ (క్రాస్ డ్రైనేజీ) పనులు దెబ్బతిన్నాయని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జీల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ1,157 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ హైవేపై రామాయంపేట వద్ద నీరు ప్రవహించడంతో కాజ్ వేలు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, భిక్కనూరు, లింగంపేటల్లో భారీ వర్షాలకు కల్వర్టులు కూలిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్‌లలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. భిక్నూర్ మండలంలోని రామేశ్వర్‌పల్లి వద్ద ఒక రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అక్కన్నపేట, రామాయంపేట మధ్య రైల్వే లైన్ కూడా దెబ్బతిన్నది. ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో రోడ్లు, కల్వర్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రమాదకరమైన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయండి: మంత్రి
రోడ్లు తెగిన చోట, కల్వర్టులు పొంగిపొర్లుతున్న చోట, వాగులు ఉదృతంగా ప్రవహించే మైనర్ బ్రిడ్జిల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కాజ్ వేలు, కల్వర్టులు, బ్రిడ్జీలు, కోతకు గురైన రోడ్ల వివరాలు అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాలు తగ్గుముఖం పట్టగానే తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆర్ అండ్ బీ ఇంజినీర్లు అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తూ.. పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఏ రోజుకు ఆరోజు వివరాలు ఉదయం, సాయంత్రం తనకు రిపోర్ట్ చేయాలని సూచించారు.






