వడదెబ్బ మృతుల్లో తేడా.. 2024లో రాష్ట్ర లెక్కల్లో 10.. NCRB రికార్డుల్లో 116

by Ajay Maddhiboyina |

తెలంగాణలో భానుడి భగభగలకు బలవుతున్న వారి సంఖ్యపై ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

వడదెబ్బ మృతుల్లో తేడా.. 2024లో రాష్ట్ర లెక్కల్లో 10.. NCRB రికార్డుల్లో 116
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భానుడి భగభగలకు బలవుతున్న వారి సంఖ్యపై ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2024 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేవలం 10 వడదెబ్బ మరణాలను మాత్రమే నమోదు చేయగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు మాత్రం ఏకంగా 116 మంది మరణించినట్లు చెబుతున్నాయి. అంటే సుమారు 106 మరణాలు అధికారిక లెక్కల్లోకి ఎక్కలేదు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో వడదెబ్బ మరణాలను లెక్కించే విధానంలో స్పష్టత లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా చూస్తే 2023లో 804గా ఉన్న మరణాలు 2024 నాటికి 1,832కి చేరాయి. ఏడాది కాలంలోనే మరణాల రేటు 128 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

తేడా ఎక్కడ వస్తోంది?

రెండు ప్రభుత్వ విభాగాల మధ్య మరణాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న వైరుధ్యమే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం. ఎన్‌సీఆర్‌బీ విధానం మేరకు పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్, పంచనామా ఆధారంగా వడదెబ్బ వల్ల మరణించినట్లు గుర్తిస్తే ఆ వివరాలను రికార్డుల్లో చేర్చుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వేరేలా ఉన్నాయి. తెలంగాణ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం.. ఒక మరణాన్ని వడదెబ్బగా ధ్రువీకరించాలంటే.. మెడికల్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టం నివేదిక, ఆ సమయంలో ఉన్న ఉష్ణోగ్రత రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం లేదా వర్బల్ అటాప్సీ వంటివన్నీ తప్పనిసరి. ఇవన్నీ ఉంటేనే దాన్ని అధికారిక మరణంగా పరిగణిస్తారు.

డేటా ఉన్నా.. నమోదు శూన్యం

రాష్ట్రంలో హీట్ డేటాకు ఏమాత్రం కొరత లేదు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ద్వారా 1091 వెదర్ స్టేషన్ల నుంచి ప్రతి గంటకు ఉష్ణోగ్రత వివరాలను సేకరిస్తున్నారు. 2025 ఏప్రిల్‌లోనే ఆదిలాబాద్‌లో గరిష్టంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2026లోనూ అసాధారణ స్థాయిలో వడగాల్పులు ఉంటాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో భారీగా వెదర్ స్టేషన్లు లేదా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు లేవు. అయినప్పటికీ అక్కడ (422) వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతుంటే, అత్యాధునిక సాంకేతికత ఉన్న తెలంగాణలో మాత్రం కేవలం 10 మరణాలే చూపడం గమనార్హం.

కారణం ఎండ.. కాగితాల్లో గుండెపోటు

పొలాల్లో పనిచేస్తూ కుప్పకూలే రైతులు, నిరుపేదలు, వృద్ధులు ఆస్పత్రికి వెళ్లేలోపే మరణిస్తే వారి వివరాలు అధికారిక గణాంకాల్లో చేరడం లేదు. అలాగే తీవ్రమైన ఎండల వల్ల గుండెపోటు, శ్వాసకోశ సమస్యలు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉధృతమై చనిపోయినప్పుడు.. మరణ ధ్రువీకరణ పత్రాల్లో ‘కార్డియాక్ అరెస్ట్’ అని మాత్రమే పేర్కొంటున్నారు. ఎండల ప్రభావం వల్ల ఆ సమస్యలు తలెత్తినప్పటికీ, టెక్నికల్‌గా అది వడదెబ్బ మరణం కింద నమోదు కావడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్) కింద వడదెబ్బ మరణాలకు ఇచ్చే రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందాలంటే ఆ మరణం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాలి. కానీ, కఠినమైన నిబంధనల వల్ల వందలాది కుటుంబాలకు ఈ సాయం అందకుండా పోతోంది. మరణాల లెక్కింపు ప్రక్రియను సరళతరం చేయాలని, అప్పుడే మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story