- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటి త్రైమాసికంలో వంద శాతం బొగ్గు రవాణా: సీఎండీ ఎన్.బలరామ్
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వంద శాతం బొగ్గు రవాణా సాధించిందని, అలాగే బొగ్గు ఉత్పత్తిలోనూ 99 శాతం లక్ష్యాలను సాధించామని ఇందుకు కార్మికులకు ధన్యవాదములు తెలియజేస్తున్నానని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వంద శాతం బొగ్గు రవాణా సాధించిందని, అలాగే బొగ్గు ఉత్పత్తిలోనూ 99 శాతం లక్ష్యాలను సాధించామని ఇందుకు కార్మికులకు ధన్యవాదములు తెలియజేస్తున్నానని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. ఈ జులైలో కూడా రోజుకు 1.8 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.15 లక్షల టన్నుల రవాణా సాధించాలని ఆయన కార్మికులకు సూచించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల
2025 వరకు బొగ్గు రవాణా లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా, 103 శాతంతో కంపెనీ 166 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందన్నారు. అలాగే బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా, 99 శాతం తో కంపెనీ 159.9 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి సాధించిందని తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఈ మేరకు శనివారం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల్లోని జీఎంలతో కలిసి త్రైమాసిక ప్రగతిపై సీఎండీ బలరాం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి కుంటుపడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జులై నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కోసం రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతీ ఏరియా ప్రగతిపై సంబంధిత ఏరియా జీఎంతో సమీక్షించారు. ఉత్పత్తికి అవరోధంగా ఉన్న అంశాల పైన ఆయన అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్మికులు, కార్మిక సంఘాల కోరిక నేపథ్యంలో కొత్తగూడెంలో అన్ని అనుమతులు మంజూరైన వీకే ఓపెన్ కాస్ట్ గని భూమి పూజ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో నిర్వహిస్తామన్నారు. ఇల్లందు జేకే కోల్ మైన్, గోలేటి కోల్ మైన్‌కు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు సంబంధించి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని సీఎండీ ఆదేశించారు. బొగ్గు నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. వినియోగదారులకు ఇస్తామన్న గ్రేడ్ బొగ్గును సరఫరా చేయడానికి ప్రతీ ఏరియాలో సీహెచ్‌పీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే రక్షణకు సంబంధించి ప్రతీ గనిలో రక్షణ ఆడిట్లను నిర్వహించాలని, రక్షణ లోపాలు లేకుండా సవరించాలని ఆయన సేఫ్టీ విభాగం వారిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తిపై కూడా ఆయన సమీక్షించారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని చండిపడా రైల్వే సైడింగ్‌కు రవాణా చేయడానికి తగు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తొలి మహిళా రెస్క్యూ టీంకు సర్టిఫికేట్ ప్రదానం
సింగరేణి చరిత్రలో 136 ఏళ్లలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా జట్టును సింగరేణీ సీఎండీ ఎన్.బలరామ్ అభినందించారు. సింగరేణిలో మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని, నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వారిని అభినందించి, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టును ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రమాద సమయాల్లో, సేవా కార్యక్రమాల్లో మహిళా రెస్క్యూ జట్టు తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలని ఆదేశించారు. త్వరలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే రెస్క్యూ పోటీలలో కూడా పాల్గొని సింగరేణికి మంచిపేరు తేవాలని కోరారు. సింగరేణి రెస్క్యూ బృందాలు ఇటీవల పాశమైలారం అగ్ని ప్రమాద దుర్ఘటనలో, శ్రీశైలం ప్రమాద సమయంలోనూ అలాగే తమిళనాడు ప్రమాదంలోనూ తమ సేవలను అందించి ప్రశంసలు అందుకున్నారన్నారు. రాష్ట్ర, కేంద్ర విపత్తు ప్రతి స్పందన బృందాలకు సింగరేణి రెస్క్యూ స్టేషన్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి రెస్క్యూను బలోపేతం చేయడానికి అత్యాధునిక సహాయ పరికరాలను సమకూర్చినట్లు బలరామ్ వెల్లడించారు. అదే సమయంలో రామగుండం-2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నట్లు వెల్లడించారు. మహిళా రెస్క్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ట్రైనర్లు తిరుపతి, కిషన్‌రావు, సందీప్, సాజిద్ అలీకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు.






