రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన పంటల సాగు

by  |
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన పంటల సాగు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో వానకాలం పంటల సాగు గణనీయంగా పెరిగింది. 32జిల్లాల పరిధిలో 63శాతం పంటలు సాగవుతున్నాయి. ఇంకా ప్రాజెక్టుల కింద వరి సాగు పెద్దగా మొదలు కాలేదు. ఇది కూడా ఊపందుకుంటే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. వ్యవసాయ శాఖ గురువారం రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రం మొత్తం మీద ఈ సీజన్‌కు 1.25కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని అంచనా వేస్తే ఇప్పటికే దాదాపు 65.33లక్షల ఎకరాల్లో మొదలైంది. గత వానాకాలంలో ఇదే సమయానికి 40,89,174 ఎకరాల్లో పంటలు సాగులో ఉంటే ఈసారి మాత్రం 65,33,453 ఎకరాలకు పెరిగింది. వాస్తవంగా సాగు ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది వానాకాలం రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల్లో ఉండాలి. తాజా నివేదికల ప్రకారం 65.33 లక్షల ఎకరాల్లో సాగు పూర్తి అయింది. ప్రధాన పంటల్లో పత్తి 60.16 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా, 46.23 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంది. కంది పంట 12.31 లక్షల ఎకరాల్లో టార్గెట్ ఉండగా 7.05 లక్షలు, సోయా 3.77 లక్షల ఎకరాల్లో సాగు పూర్తి అయింది. జొన్న 89 వేలు, పెసర్లు 1.01 లక్షలు, మినుములు 33 వేలు, చెరుకు 41 వేలతో పాటు ఇతర పంటలు, పప్పు దినుసులు మొత్తం 8.40 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

ఊపందుకోని కాల్వల కింది సాగు భూములు

ప్రాజెక్టుల పరిధిలో కాల్వలకు నీరు విడుదల కాకపోవడం, ప్రణాళికను ప్రకటించకపోవడంతో వరి సాగు ఊపందుకోలేదు. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్‌లో జూరాల నుంచి బీమా, కల్వకుర్తి సమాంతర కాల్వలకు నీటి విడుదల మొదలైంది. దీంతో ఈ ఆయకట్టు రైతులు ఇప్పుడిప్పుడే వరి సాగుకు రెడీ అవుతున్నారు. బాబ్లీ గేట్లు ఎత్తడంతో ఎస్సారెస్పీకి వరద మొదలైంది. కానీ దిగువకు నీటి విడుదల మొదలు కాలేదు. దీంతో ఈనెల 15తర్వాత తెలంగాణ సోనా వరి సాగు మొదలు పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది.

సీఎం లెక్క ప్రకారమే పత్తి సాగు

నియంత్రిత సాగు విధానాన్ని ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా మొక్కజొన్న సాగును పూర్తిగా వద్దని సీఎం కేసీఆర్ సూచించారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా జిల్లాల్లో మొక్కజొన్న సాగు మొదలైంది. రాష్ట్రలో మొక్కజొన్న 93వేల ఎకరాల్లో సాగవుతోంది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పత్తి సాగు వైపు రైతులు ఆసక్తి చూపారు. గతేడాది పత్తిసాగు ఇదే రోజుతో పోలిస్తే 103 శాతం పెరిగింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో సాధారణ పత్తి సాగు ఏరియా 44,50,029 ఎకరాలు. కానీ గురువారం నాటికి 46,23,335 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. కంది పంట వైపు కూడా రైతులు మొగ్గు చూపుతున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఈసారి అత్యధికంగా కంది సాగులోకి వచ్చింది. కంది సాగు ఇప్పటికే వార్షిక లక్ష్యంలో దాదాపు 90 శాతం పూర్తి అయింది.

వరి తక్కువగా…

ప్రస్తుతం వరి సాగు కేవలం 14శాతానికే పరిమితమైంది. మొత్తం 41.76 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేయగా గురువారం వరకు 4.16 లక్షల ఎకరాల్లో వేశారు. బోర్లు, బావుల పరిధిలోనే ప్రస్తుతం సాగవుతోంది. ప్రాజెక్టు కాల్వలపై ఆధారపడి సాగు చేసే రైతులు ప్రస్తుతం నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎగువ ప్రాంతం నుంచి గోదావరి, కృష్ణా జలాలు వస్తే ప్రాజెక్టుల నుంచి దిగువకు విడుదలైతే వరి సాగు పనులు ముమ్మరమవుతాయి. అటు నియంత్రిత సాగు విధానంలో మొక్కజొన్న సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దీన్ని ప్రధాన పంటగా సాగు చేసుకుంటున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 3.69లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. కానీ ప్రస్తుతం 93,950 ఎకరాల్లో సాగు మొదలైంది. వికారాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా ఉంది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 32 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారు.

పత్తి వైపే రైతుల ఆసక్తి

మొత్తం పంటల సాగులో పత్తి 103 శాతం, 14 శాతం వరకు వరి, జొన్న 74 శాతం, కంది 90 శాతం, పప్పు ధాన్యాలు 78శాతం, చెరుకు 52శాతం, నూనెల రకం 62, సోయాబీన్ 74, పెసర్లు 48 శాతం, రాగులు 29 శాతం, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వేరుశనగ, పసుపు పంటలు సగటున 22శాతం వరకు వేసినట్లు నివేదికలో అధికారులు వెల్లడించారు. 25శాతం లోపు పంటలు సాగు చేసిన జిల్లాలు మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, ములుగు, జగిత్యాల జిల్లాలు ఉండగా, 50 శాతం లోపు జాబితాలో ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జోగుళాంబ గద్వాల, సిద్ధిపేట జిల్లాలున్నాయి. 75శాతం లోపు పంటలు సాగుచేసిన జిల్లాలు నల్గొండ, మంచిర్యాల, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిర్మల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉండగా, 100 శాతంలోగా పంటలు సాగు చేసిన జాబితాలో మెదక్, సంగారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్ జిల్లాలు ఉండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 100 శాతానికి పైమేర పంటలు సాగు చేశారు.

ప్రధాన పంటల సాగు (ఇప్పటి వరకు)



Next Story

Most Viewed