రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

by  |
Rain alert in telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలు వరంగల్ పట్టణాన్ని ముంచెత్తాయి. కాగా, సకాలంలో రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడంతో పంటలకు మేలు చేకూరనుంది. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని చెరువుల్లో, రిజర్వాయర్లలో ఇప్పటికే నీరు నిల్వ ఉండటంతో మోస్తారు వర్షాలకే అలుగు పారనున్నాయి.

ఈ ఏడాది సాధారణ వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే రాష్ట్రానికి రుతుపవనాలు చేరుకున్నాయి. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాగ‌ల 24 గంట‌ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ప‌శ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి భారీగా ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

సకాలంలో చేరుకున్న రుతు పవనాలు

రాష్ట్రానికి సకాలంలో రుతుపవనాలు చేరుకున్నాయి. మూడు రోజుల ముందు కేరళ తీరాన్ని చేరిన నైరుతీ రుతుపవనాలు రాష్ట్రానికి అనుకున్న సమయానికి చేరుకున్నాయి. గతేడాది జూన్ 1న కేరళను చేరుకున్న రుతు పవనాలు రాష్ట్రంలోకి జూన్ 12న ప్రవేశించాయి. ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే రాష్ట్రంలోకి చేరుకున్నాయి. గత 10 పదేళ్ల జాబితాను పరిశీలిస్తే కేరళను తాకిన 10 నుంచి 15 రోజుల మధ్యలో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ ఈ ఏడాది మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించాయి. గత పదేళ్లలో రుతుపవనాలు కేరళను, రాష్ట్రాన్ని అతి త్వరగా చేరుకున్న వివరాలు పరిశీలిస్తే.. 2011 మే 29న కేరళను తాకగా.. జూన్ 7న రాష్ట్రానికి చేరుకున్నాయి. 2013 జూన్ 1న కేరళకు చేరగా జూన్ 4న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2015 మే 30న కేరళకు, జూన్ 12న రాష్ట్రానికి వచ్చాయి. గతేడాది జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా తెలంగాణ రాష్ట్రానికి జూన్ 11న చేరుకున్నాయి.

పంటలకు మేలు చేకూరుస్తున్న రుతుపవనాలు

సరైన సమయానికి వర్షాలు కురుస్తుండంటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటే సమయానికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సాగు పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 3 అంగుళాల లోతు వరకు భూమి తడిసే అవకాశాలుండటంతో విత్తనాలు నాటేందుకు అనుకూలమైనదిగా రైతులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో దాదాపుగా నీరు నిల్వ ఉండటంతో మోస్తరు వర్షాలు కురిసినా చెరువులు, రిజర్వాయర్లు అలుగుపారే అవకాశాలున్నాయి. కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో రాష్ట్రంలోని కృష్ణానదిపై ఉండే తొలి ప్రాజెక్ట్ జూరాల గరిష్ట మట్టానికి చేరుకుంది.


Next Story