జీతాల కోతకు ఆర్డినెన్స్

by  |
జీతాల కోతకు ఆర్డినెన్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ వేతనాల్లో కోత పెట్టడానికి ఉద్దేశించిన ఆర్డినెన్సును ప్రభుత్వం ఆఘమేఘాల మీద విడుదల చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందువల్ల ఆర్డినెన్సు రూపంలో తీసుకురావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతో విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన పింఛనుదార్లకు ప్రతీనెలా చెల్లించే పింఛనులోనూ కోత పెట్టనున్నట్లు ఈ ఆర్డినెన్సులో ప్రభుత్వం పేర్కొంది. ఒకవైపు హైకోర్టులో పింఛనులో కోత విధించడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆర్డినెన్సు రావడం గమనార్హం. ఈ ఆర్డినెన్సును ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు ఆర్డినెన్సును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయవాదికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది.

ఆర్డినెన్సులో ఏముంది?

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం పడిపోవడంతో ఉద్యోగులకు, టీచర్లకు చెల్లించే నెలవారీ జీతాల్లో ప్రభుత్వం యాభై శాతం కోత విధించింది. పింఛనులో 25% కోత పెట్టింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇప్పుడు తాత్కాలికంగా కోత విధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్సు బాట పట్టింది. ఈ ఆర్డినెన్సుకు తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ (ప్రత్యేక ప్రొవిజన్లు) ఆర్డినెన్సు 2020 అని నామకరణం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అంటువ్యాధి ప్రబలంగా ఉన్నందున ప్రత్యేక ప్రజారోగ్య సమస్యగా పేర్కొని ఈ ఆర్డినెన్సుకు శ్రీకారం చుట్టింది.

ఆర్డినెన్సులో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు:

– ఈ ఆర్డినెన్సు మార్చి 24, 2020 నుంచి అమలులోకి వస్తుంది.
– ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పించనుదార్లు ఈ ఆర్డినెన్సు పరిధిలోకి వస్తారు. వారికి చెల్లించే వేతనాలు, పింఛన్లలో యాభై శాతానికి మించకుండా కోత పెట్టే వెసులుబాటు ఈ ఆర్డినెన్సు ద్వారా ప్రభుత్వానికి లభిస్తుంది.
– రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడినందున రాజ్యాంగంలోని 213వ అధికరణం మేరకు ఆర్డినెన్సును తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
– ఆర్డినెన్సును తీసుకొచ్చినందువల్ల ఇందులో పేర్కొన్న వేతనాలు, ఉద్యోగులు, కోతలు, పింఛన్లు తదితరాలకు సంబంధించి ఏదేని చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నా వాటికి ఇది అతీతంగా ఉంటుందని, అవి చెల్లకుండా వాటికి పై స్థాయిలో ఈ ఆర్డినెన్సు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
– స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ ఆర్డినెన్సు పరిధిలోకి వస్తారు.
– ఇప్పుడు తాత్కాలికంగా కోత పెట్టిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలనుకుంటే దానికి సంబంధించి నోటిపికేషన్ వెలువడుతుందని, అది వెలువడిన ఆరు నెలల వ్యవధిలో ఉద్యోగులకు అందనున్నట్లు ఆర్డినెన్సు పేర్కొంది.
– అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం సభ ఆమోదం కోసం చర్చకు పెడుతుంది. ఆ తర్వాత చట్టంగా మారనుంది.

ప్రైవేటుకు బాట చూపిన ప్రభుత్వం

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడంతో ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పింఛనుదార్ల జీతాలు, పింఛన్లలో తాత్కాలికంగా కోత పెట్టింది. అయితే లాక్‌డౌన్‌లో మూతపడిన ప్రైవేటు సంస్థలు, దుకాణాలకు కూడా ఇప్పుడు ఈ ఆర్డినెన్సు బలం చేకూర్చినట్లయింది. ఆర్థికంగా శక్తివంతమైన ప్రభుత్వానికే జీతాల చెల్లింపు సమస్య ఉంటే ప్రైవేటు సంస్థల, దుకాణాల, పరిశ్రమల యజమానులుగా తమకు ఇంకా ఎక్కువే సమస్యలు ఉంటాయని, తాము కూడా ఉద్యోగులకు జీతాలను కత్తిరించక తప్పదనే అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే కోర్టుల పరిధిలో అనేక పిటిషన్లపై విచారణ జరుగుతూ ఉంది. కార్మిక శాఖలు మాత్రం వేతనాలు చెల్లించాలనే సర్క్యులర్లను జారీ చేశాయి. కానీ అమలు మాత్రం కోర్టుల దగ్గరకు చేరుకుంది. ప్రభుత్వానికే సాధ్యం కానిది ప్రైవేటు యజమానులుగా తమకు ఎలా సాధ్యమనే సాకుతో ఇకపైన చిరుద్యోగుల వేతనాలను అధికారికంగా కత్తిరించడానికి మార్గం సుగమమైంది.

ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలి: బహుజన టీచర్స్

తెలంగాణా ప్రభుత్వం రాత్రికి రాత్రి ఆఘమేఘాల మీద ఆర్డినెన్సును తీసుకురావడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీవితాలతో ఆడుకోవడమేనని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య, ప్రధాన కార్యదర్శి మార్వాడీ గంగరాజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలీచాలని జీతంతో అప్పుల బారిన పడ్డారని, ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని, పునరావృతం కాకుండా ఉండాలంటే జూన్ నెల నుంచి పూర్తి జీతాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

గడచిన నెలలకు మాత్రమే ఈ ఆర్డినెన్సు : కారెం రవీందర్‌రెడ్డి

ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు, వచ్చే నెల 1వ తేదీన అందుకునే ఈ నెలకు సంబంధించిన జీతానికి సంబంధం లేదని తెలంగాణ ఎన్జీవో సంఘం నేత కారెం రవీందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఆర్డినెన్సు గడచిపోయిన నెలలకు సంబంధించిందే తప్ప రానున్న నెలలకు కాదని అన్నారు. ప్రస్తుత నెలకు పూర్తి జీతాన్ని చెల్లించాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని, ఆ తరహాలోనే వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. పూర్తి జీతం డిమాండ్ గురించి ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టత ఉందని, తప్పకుండా తమ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు.

చట్టవిరుద్ధ ఆర్డినెన్సు : సీఐటీయూ

కరోనాను సాకుగా తీసుకుని గత మూడు నెలలుగా ఉద్యోగులు,ఉపాద్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విశ్రాంతి ఉద్యోగుల పేన్షనర్లలో కోత పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఆర్డినెన్సును తీసుకురావడం ఖండించదగినదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ వ్యాఖ్యానించింది. తక్షణం ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వేతనాల కోతను ఆపాలని, పూర్తి పింఛనను చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఆర్డినెన్స్ కాపీని గురువారం దగ్ధం చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి సాయిబాబు పేర్కొన్నారు.

పూర్తి వేతనాలు చెల్లించాలి : విద్యుత్ ఉద్యోగులు

కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్ళకు పరిమితమైతే నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే కార్మికులు ఉద్యోగులకు మాత్రం వేతనాల్లో యాజమాన్యం కోత విధించిందని, పూర్తి వేతనాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీకి విజ్ఞప్తి చేశారు. సంస్థలోని ఉన్నతాధికారులకు పూర్తి వేతనాలను చెల్లిస్తున్న యాజమాన్యం ఫీల్డ్ మీద తిరిగే వారికి మాత్రం కోత విధించడం బాధించిందని పేర్కొన్నారు. తక్కువ జీతంతో బతికే ఉద్యోగులకు యాభై శాతం కోత విధించడం ద్వారా కుటుంబ పోషణ భారంగా మారిందని, మూడు నెలలుగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల నుంచి వేతనాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని 18 ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి.

ఇదో నల్లచట్టం – గ్రామ రెవెన్యూ ఆఫీసర్ల సంఘం

లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయిందనే పేరుతో వల్ల జీతాలు చెల్లించడం సాధ్యం కాదంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు ఓ నల్లచట్టం అని తెలంగాణ స్టేట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. వేతనాల్లో కోత పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన ఘాటు విమర్శలతో ఖంగుతిన్న ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆర్డినెన్సును జారీ చేసిందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గరికె ఉపేందర్ రావు, హరాలే ‌సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్లలో కోత విధించే అధికారం ఉందంటూ ప్రభుత్వం వాదించిందని, ఏ హక్కు ఉందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని వివరణ కోరిందని వీరు గుర్తుచేశారు. కోర్టు నుండి రక్షణ పొందడానికే రాత్రికి రాత్రి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇది పూర్తిగా ఉద్యోగులను వంచించడానికి, మోసం చేయడానికి తీసుకొచ్చిన నల్ల చట్టం అని వ్యాఖ్యానించారు. కోతపడిన మూడు నెలల వేతన బకాయిలతో పాటు జూన్ నెల పూర్తి వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సహాయ నిరాకరణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

చీకటి ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి: ఐక్యవేదిక

గత మూడు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో కోతపెడుతున్న ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దమైన తన చర్యను సమర్ధించుకోవటానికే రాత్రికి రాత్రి ఆర్డినెన్సును తీసుకొచ్చిందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఆర్డినెన్సుతో కనీస వేతనాలు, సెలవులు లాంటి నిబంధనలేవీ వర్తించని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఈ ఆర్డినెన్స్ లో చేర్చటం అత్యంత హేయమైన చర్య అని వ్యాఖ్యానించింది. హైకోర్టుకు సమాధానం చెప్పుకోలేక ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, ఎంప్లాయీ ప్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఇలాంటి చీకటి ఆర్డినెన్సును తీసుకొచ్చిందని విమర్శించింది.


Next Story

Most Viewed