లైట్ తీసుకోండి.. రైతుల ఆత్మహత్యలపై కలెక్టర్లకు సర్కార్ సంచలన ఆదేశాలు

by  |
లైట్ తీసుకోండి.. రైతుల ఆత్మహత్యలపై కలెక్టర్లకు సర్కార్ సంచలన ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల ఆత్మహత్యలపై తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వెరిఫికేషన్ లాంటి చర్యలకు ఉపక్రమించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ లాంటి పథకాలు వచ్చాక రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయాయని, గతం కంటే పరిస్థితి మెరుగైందని పేర్కొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల విషయంలో అరుదైన కేసుల్లో మాత్రమే వెరిఫికేషన్ లాంటి ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం వస్తే ఆత్మహత్యకు గల కారణాన్ని నిర్ధారించడానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీలో కేవలం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని మాత్రమే నామినేట్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. పేరుకు త్రిసభ్య కమిటీ అయినా వెరిఫికేషన్ మాత్రం కేవలం ఒక్క అధికారితోనే సరిపెట్టుకుంటే చాలనే సంకేతం ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంలేదు. కేంద్ర హోంశాఖ సైతం రెండేండ్లుగా రైతుల ఆత్మహత్యలపై నివేదికను రూపొందించడం లేదు.

కానీ రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు మాత్రం రైతుల ఆత్మహత్యల వివరాలను సేకరిస్తూ కారణాలను విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు గణనీయంగానే జరుగుతున్నట్టు రైతు స్వరాజ్య వేదిక పేర్కొన్నది. గతేడాది 685 మంది రైతులు చనిపోయారని వ్యాఖ్యానించింది. అంతకుముందు దాదాపు వెయ్యి మందికి పైగా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 468 మంది చనిపోయినట్టు పేర్కొన్నది.

రైతుబీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది మే చివరి వరకు రాష్ట్రంలో సుమారు 49,755 మంది రైతులు చనిపోయారని, వారికి బీమా పరిహారం అందినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఏ కారణం చేత చనిపోయినా బీమా పరిహారం అందుతూ ఉన్నందున నిర్దిష్ట కారణాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదు. దీంతో రైతుది సహజ మరణమా? లేక ఆత్మహత్యా? అనే వివరాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అరుదైన కేసుల్లో మాత్రమే త్రిసభ్య కమిటీలో ఒక సభ్యుడిగా జిల్లా వ్యవసాయ అధికారిని నియమిస్తే సరిపోతుందంటూ జిల్లా కలెక్టర్లకు రాసిన సర్క్యులర్‌లో వ్యవసాయ కమిషనర్ పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed