‘గంజికూటి’ల ఓట్లు కావాలి.. కానీ, పథకాలు ఇవ్వరా..?

by  |
‘గంజికూటి’ల ఓట్లు కావాలి.. కానీ, పథకాలు ఇవ్వరా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జనాభా లెక్కల్లో ఉన్నా.. వారు మాత్రం ఏ పథకానికి అర్హులు కారు. ఓట్ల పండగప్పుడు మాత్రం వారు భక్తులుగా కనిపిస్తున్న వీరి జీవనం అత్యంత దయనీయం. సంక్షేమ ఫలాలూ అందుకోలేని వీరు ఉపాధి కూలీలుగా కూడా అనర్హులంటే వీరి దుర్భర జీవనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అణగారిన వర్గాల అభ్యున్నతే మా లక్ష్యమంటూ ప్రగల్భాలు పలికే పాలకులకు వీరి గోస మాత్రం పట్టడం లేదు. పూరి పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారెవరు..? వారి పరిస్థితి ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

జగిత్యాల జిల్లా కొండగట్టు గుట్ట కింది ప్రాంతంలో 30 కుటుంబాలు, రాయికల్ మండల కేంద్రంలో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. గంజికూటి కులంగా చెప్పుకుంటున్న వీరు జనాభా లెక్కలకు తప్ప సర్కారు సంక్షేమాన్ని పొందలేకపోతున్నారు. వీరి ఓట్లను ఆశిస్తూ అభ్యర్థిస్తూ కాలం వెల్లదీస్తున్న పాలకులు కూడా గంజికూటి సామాజిక వర్గానికి న్యాయం చేయడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 కుటుంబాలకు చెందిన వీరు 2500 మంది వరకు ఉంటారని వీరు చెప్తున్నారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలోని అంబారిపేట, భూపాలపల్లి జిల్లా వొడితెల కొత్తపల్లి, ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని రమణక్క పేట, వరంగల్ జిల్లా నర్సంపేట, గిర్నిబాయి, తొర్రూరు, సిద్దిపేట జిల్లా చందలభందం, జాగిల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వీరు జీవిస్తున్నారు.

అయితే ఈ సామాజిక వర్గానికి రికార్డుల్లో గుర్తింపు లేకపోవడంతో ఎంతమంది ఉన్నారన్న గణాంకాలపై కూడా స్పష్టత లేదనే చెప్పాలి. దశాబ్దాలుగా వీరు ఇలాగే మగ్గి పోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం లేకుండా పోయింది. గెజిట్‌లో గంజికూటి కులం గురించే లేకపోవడంతో రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దీంతో వీరు చదువుకుని ఉద్యోగం పొందడం మాత్రం ఇబ్బందిగానే మారిపోయింది.

సర్టిఫికెట్లు ఇచ్చే వారు లేకపోవడంతో గంజికుంట సామాజిక వర్గానికి చెందిన వీరు సరస్వతి నిలయాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చదువుకోవాలన్న తపన ఉన్న నేటి తరం కూడా కూలీలుగా మారిపోయి బ్రతకడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి దాపురించింది వీరికి. నిలువ నీడలేని గంజికూటి కులానికి చెందిన వారికి సర్కారు పథకాలు కూడా అందుకునే పరిస్థితి లేకపోవడంతో పూరి పాకలు వేసుకుని కొండగట్టు గుట్ట కింద జీవనం వెల్లదీస్తున్నారు. దీంతో వీరి ఇళ్లకు పంచాయితీ నెంబర్లు కూడా కెటాయించకపోవడంతో కనీసం ఉపాధి హామీ పథకంలో కూలీ పని చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

బీసీ కమిషన్ చొరవతో…

2019లో అప్పటి బీసీ కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణ మెహన్ కొండగట్టులో పర్యటించి, గంజికూటి కులస్తుల సమస్యలను తెలుసుకున్నారు. తమను ఎస్సీలుగా గుర్తించాలని వారు బీసీ కమీషన్‌ను కోరారు. విచారణ జరిపిన కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అనంతరం ప్రభుత్వం వీరిని చాకలి కులానికి ఉప కులంగా గుర్తించి బీసీ‌‌–ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని జీఓ జారీ చేసింది. అయితే ఈ జీఓ ఆధారంగా ఒక్కరికి కూడా కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. తమను ఎస్సీల్లో చేర్చమంటే బీసీల్లో చేర్చారని అయితే బీసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమానికి నో…

ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ఈ కులం వారికి అందడంలేదు. కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్‌లతో పాటు సబ్సిడీ పథకాలకు కూడా అనర్హులుగా మిగిలిపోయారు. కులం సర్టిఫికెట్ ఇచ్చే వారు లేక ఉద్యోగాలు కూడా పొందలేమని భావించిన వీరు అర్థాంతరంగా చదువు మానేస్తున్నారు. చాలా మంది కూడా బాల్య వివాహాలు చేసుకుంటున్నారు. గతంలో కొందరికి చాకలి కలస్థులుగా, మరి కొందరికి బుడిగ జంగాల కులం వారిగా సర్టిఫికెట్లు ఇచ్చారని ఇప్పుడా పరిస్థితి కూడా లేకుండా పోయింది.

శాసనమూ భద్రం…

పూరి పాకలో జీవనం సాగిస్తున్న వీరు తమ వంశానికి చెందిన శాసనాన్ని భద్రపర్చుకోవడం విశేషం. చాకలి సామాజిక వర్గానికి చెదిన ఇళ్లలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేవారమని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారం కూడా తమ వద్ద ఉందని వారు చెప్తున్నారు. తరతరాలుగా తమ కులవృత్తి గురించి తెలిపే ఈ శాసనం నేటికీ వారి వద్ద ఉండడం విశేషం.

ఓట్ల కోసమేనా… ?

తాము కేవలం ఓటర్లుగా మాత్రమే పనికి వస్తున్నాం తప్ప మాకు పథకాలు అందజేసేందుకు మాత్రం ఎవరూ చొరవ చూపడం లేదు. పొట్ట కూటి కోసం కూలీలుగా జీవనం సాగిస్తున్న మా సామాజిక వర్గంపై ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. తమకు కులం గుర్తింపు సర్టిఫికెట్ ఇప్పించి తమ వారసులకు బంగారు బాట వేయాలని వేడుకుంటున్నా. -రాజేశం, గంజికూటి కుల రాష్ట్ర అధ్యక్షుడు

కూలీగా మారిపోయా..

మా కులానికి గుర్తింపు లేదని చదువుకున్న లాభం లేకుండా పోయింది. బ్రతుకు దెరువు కోసం కూలీ పనికి వెళ్లక తప్పడం లేదు. మాకు న్యాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మా కులం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. -కళ్యాణ్

బ్రతుకుతున్నామంతే..

సర్కారోళ్లు సాయం చేయడం లేదు. మా కులపోళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉపాధి కూలీగా కూడా బ్రతికే పరిస్థితి లేదు. కుటుంబాన్ని పోషించుకోవాలంటే తప్పక కూలీ నాలీ చేసుకుంటూ జీవిస్తున్నాం. సర్కారు పథకాలు కూడా మాకు అందడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాపై కరుణ చూపి కులానికి గుర్తింపు ఇచ్చి ఎస్సీల్లో చేర్చాలని చేతులెత్తి మొక్కుతున్నా. -శాంత

మాకు న్యాయం చేయండి..

తమ కులానికి గుర్తింపు ఇచ్చి రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం తమ గురించి సర్వేలు చేయించి చదువుకున్న తమ వారిని ఆదుకునేందుకు చొరవ చూపాలి. సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలి. -సుగుణ

Next Story

Most Viewed