‘మా ఇంట్లో అందరికీ కరోనా.. డిశ్చార్జీ టైంల నా భర్తలేడు’

by  |
‘మా ఇంట్లో అందరికీ కరోనా.. డిశ్చార్జీ టైంల నా భర్తలేడు’
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల లెక్కలు, మృతుల సంఖ్య, కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ.. ఇలా ఏ అంశంలో చూసుకున్నా అంతా గోప్యమే. ఈ లెక్కల చిక్కులు, అర్ధ సత్యాలతో కూడిన సమాచారం ఏదో ఒక రోజు బహిర్గతమవుతుందనే అంచనాలకు తగ్గట్లుగానే రాష్ట్రంలోని కరోనా లెక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ విషయం కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో నగరంలోని వనస్థలిపురానికి చెందిన ఆలంపల్లి మాధవి చేసిన ఆరోపణలకు రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

నా భర్త చనిపోయిన విషయం కూడా తెలియలేదు

“కరోనాతో బాధపడుతున్న నా భర్త మధుసూదన్ ఎక్కడున్నాడో తెలియదు. మా ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేరాం. ఈ నెల 16వ తేదీన మేం డిశ్చార్జి అయ్యే సమయంలో నా భర్త ఎక్కడున్నాడని ఆసుపత్రి యాజమాన్యాన్ని అడిగాను. వెంటిలేటర్ మీద ఉన్నాడంటూ బదులిచ్చారు. మళ్ళీ కాసేపటికి ఆయన చనిపోయాడని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానం ఇస్తుండడం నాకు అయోమయంగా ఉంది. అసలు నా భర్త బతికే ఉన్నాడా లేదా అనేది కూడా నాకు అర్థం కావడంలేదు. మంత్రిగా మీరైనా వివరాలు కనుక్కుని నాకు చెప్పండి” అంటూ వనస్థలిపురానికి చెందిన అలంపల్ల మాధవి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను కోరారు. దీనిపై ఆమెకు సరైన జవాబు రాలేదు. ఈ సంఘటనకు పది రోజుల ముందు ఆదిత్య అనే యువకుడు కూడా ఆయన బాబాయి మృతి చెందిన విషయాన్ని బులెటిన్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా కారణంగా చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించినా అధికారిక లెక్కల్లో ఎందుకు చేర్చలేదని కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దీనికి కూడా సమాధానం రాలేదు.

షాక్‌కు గురవుతుందనే చెప్పలేదు: మంత్రి ఈటల రాజేందర్

“ఏప్రిల్ 29వ తేదీన వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే పేషంట్ కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇరవైనాలుగు గంటలలోపే 30వ తేదీన చనిపోయారు. దీనితో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. 1వ తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులు అందరూ క్వారంటైన్‌లో ఉన్నారు. భార్యకి చెప్తే షాక్‌కి గురవుతుందని, ఇలాంటి సమయంలో చెప్పకుండా ఉండడమే మేలు అంటూ చుట్టాలు చెప్పారు. దీంతో మధుసూదన్ మృతదేహాన్ని పోలీస్‌కి అప్పగించి జీహెచ్ఎంసీ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించాం” అని మంత్రి ఈటల రాజేందర్ గురువారం మీడియాకు వివరించారు. బంధువులకు చెప్పకుండానే మధుసూదన్‌ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించిందని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు.

కరోనా అనగానే ప్రతీ ఒక్కరూ వణికిపోతున్నారని, గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి రోగులకు వైద్యం చేస్తున్నారని, చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్న మాధవి లాంటివారు వైద్యులపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సరికాదని మంత్రి అన్నారు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చెయ్యటానికి కుటుంబ సభ్యులే భయపడుతున్నారని, ప్రభుత్వమే చొరవ తీసుకుని అంత్యక్రియలను నిర్వహిస్తోందని తెలిపారు.

కరోనా కేసుల లెక్కల్లో దాపరికం లేదు

కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా ఎప్పటికప్పుడు బులెటిన్ ద్వారా ప్రకటన చేస్తోందని మంత్రి సమర్ధించుకున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని, రాపిడ్ టెస్ట్‌లను ప్రభుత్వమే వద్దనుకుందని వివరించారు. కానీ కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి మాత్రం కరోనా నిర్ధారణ పరీక్షల మొదలు అనేక అంశాలపై ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలను ఆమె ప్రస్తావించారని, కానీ ఆ వివరాలను బైటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. గతంలో కేసుల లెక్కల్లో తేడాలు వస్తే మీడియా సమావేశంలో సైతం మంత్రిని పాత్రికేయులు ప్రశ్నించారు. ఇప్పుడు టెస్టులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి ప్రస్తావించడం గమనార్హం. అన్ని రాష్ట్రాల లెక్కలు ఉన్నా తెలంగాణ లెక్కలు మాత్రం ఖాళీగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం.


Next Story

Most Viewed