50 వేల మార్కు ఏమైంది..? హైకోర్టు తీర్పు పట్టించుకోరా?

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: దగ్గు, జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు తేలినా, జనం నిర్ధారణ పరీక్షలకు వెళ్లడం లేదు. వీటిలో ఏ సింప్టమ్స్ ఉన్నా నేరుగా మందులు వాడేస్తున్నారు. కొందరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇచ్చే ఐసోలేషన్ కిట్లలోని మందులు వాడుతుండగా, మరి కొందరు మెడికల్ షాపులలోని గోళీలను వేసుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. ఏ జ్వరమైనా వైద్యున్ని సంప్రదించకుండా మందులు వాడటం సరైన విధానం కాదని అధికారులు సూచిస్తున్నారు. ఇలా సొంత వైద్యాన్ని అనుసరించడం వల్లన కొత్త రకపు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.

అంతేగాక టెస్టులకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్లీ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి వైరస్ వ్యాప్తి, నియంత్రణపై క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా, కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమాజానికి నష్టాన్ని తెస్తుందని ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

50 వేల మార్కు ఏమైంది..?

కరోనా కంట్రోల్ కొరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజు సగటున 50 వేలకు తగ్గకుండా టెస్టులు చేయాలని హైకోర్టు గతంలో సూచించింది. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో సామూహికంగా శాంపిల్స్‌ను నిర్ధారణ చేయాలని సూచించింది. దగ్గు, జలుబు తో పాటు ఏ సీజనల్ సింప్టమ్ఉన్నా కరోనా టెస్టు తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నది. కానీ కేసులు తగ్గుతున్నాయని అధికారులు దాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం లేదు. బలవంతంగా పరీక్షలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. కానీ టెస్టులు కొరకు వచ్చే వారికి ఎక్కడా ఇబ్బందులు కలగడం లేదని వివరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 30, ప్రైవేట్ లో 76 ఆర్టీపీసీఆర్ కేంద్రాల్లో విస్తృతంగా టెస్టులు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ నివేదించింది. అంతేగాక 1231 యాంటీజెన్ సెంటర్లలోనూ వేగంగా శాంపిల్స్ నిర్ధారిస్తున్నామని డీహెచ్ డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం…

గత కొన్ని నెలల నుంచి వైద్యారోగ్యశాఖ ప్రకటనలో చూపిస్తున్న కరోనా లెక్కలు చూసి జనాలు తీవ్రత తగ్గిందని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కు, భౌతికదూరం వంటివి సమర్ధవంతంగా పాటించడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ చాలా తేలిగ్గా మాస్కును మరుస్తున్నారు. ప్రభుత్వం కూడా పండుగలు, పార్టీ, ఇతర ఫంక్షన్ల పేరిట ఎక్కువ మంది ఒకే చోట గూమికూడే కార్యకాలాపాలకు అనుమతులు ఇస్తుంది. కానీ ఎలాంటి నిబంధనలను సూచించడం లేదు. పైగా మాస్కు లేని వారికి ఫైన్లు వేసే ప్రక్రియను గాలికి వదిలేశారు. దీంతో ప్రజల్లో తమకేమీ కాదులే అని కరోనా వైరస్ ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ప్రతీ ఆదివారం సండే ఫన్ డే కార్యక్రమంపై ప్రభుత్వమే నేరుగా గ్రూప్ గేదర్‌ను ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పెద్దలతో పాటు చిన్నారులూ భారీగా జమ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు థర్డ్ వేవ్ కు పునాదిగా మారే ఛాన్స్ ఉన్నట్లు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టులు వివరిస్తున్నారు.

కిట్ల కొరత లేదు: డీహెచ్ డా శ్రీనివాసరావు

గతంతో పోల్చితే టెస్టుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. కానీ కిట్ల కొరత ఉన్నదన్న వాదనలో నిజం లేదు. పూర్తిస్థాయిలో కిట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది లక్షణాలు తేలిన వెంటనే స్వంత వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టెస్టులు లేకుండానే మెడిసిన్స్ వాడుతున్నారు. డాక్టర్ సలహా తప్పనిసరి అని చెప్పినా కొందరిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ పీహెచ్సీలో కిట్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. టెస్టింగ్ తో పాటు వ్యాక్సినేషన్ ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం. అయితే ఈ రెండు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు,విజయవంతంగా అమలు చేస్తున్నారు. వారందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా.
వారం రోజులుగా టెస్టుల సంఖ్య
తేది సంఖ్య
9 42,166
8 47,465
7 37,857
6 39,161
5 46,578
4 43,135

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed