రెండు రోజుల్లో ముగింపు.!

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: వరద సాయాన్ని రెండు రోజుల్లో ముగించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన సైతం వెలువడే అవకాశాలు లేకపోలేదు. గతంలో అందిన దరఖాస్తులకే ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కొత్తగా లబ్ధిదారులను గుర్తించే ఊసే లేకుండా పోయింది. సాయం పంపిణీలో అధికారులు, ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం నిలిచిపోదని ప్రభుత్వం ప్రకటించినా.. అమలు జరగడం [&hellip;]</p>

రెండు రోజుల్లో ముగింపు.!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరద సాయాన్ని రెండు రోజుల్లో ముగించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన సైతం వెలువడే అవకాశాలు లేకపోలేదు. గతంలో అందిన దరఖాస్తులకే ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కొత్తగా లబ్ధిదారులను గుర్తించే ఊసే లేకుండా పోయింది. సాయం పంపిణీలో అధికారులు, ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం నిలిచిపోదని ప్రభుత్వం ప్రకటించినా.. అమలు జరగడం లేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి కొత్తగా బాధితులను గుర్తించే కార్యక్రమమేదీ ప్రారంభం కాలేదు. ఇక ముందు ప్రారంభమయ్యే అవకాశమూ లేదు. నిరంతరాయంగా సాయం పంపిణీ సాగుతుందని చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కష్టపడుతున్నా.. ఫలితం లేకుండాపోయింది. ఏ ఒక్క డివిజన్‌లోనూ ఇప్పటివరకూ ఒక్కరి నుంచి బల్దియా అధికారులు కొత్తగా దరఖాస్తులు స్వీకరించలేదు. రెవెన్యూ, కలెక్టరేట్, జీహెచ్ఎంసీ అధికారులతో కూడిన బృందాలు గతంలో లబ్ధిదారులకు నేరుగా వరద సాయాన్ని అందించగా.. ప్రభుత్వం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం లబ్ధిదారులను గుర్తించే బాధ్యత తమదేనని వారం రోజుల నుంచి ఏ విభాగం కూడా అంగీకరించడం లేదు. మరో వైపు వరద బాధితులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నా.. మరో రెండు రోజుల్లో అది కూడా పూర్తి కాబోతుంది. దీంతో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ వరద సాయంపై చేతులెత్తక తప్పేలా లేదు. ఒక వేళ లబ్ధిదారుల ఎంపిక, సాయం అందజేత ఏ పద్ధతిలో చేసినా.. లక్షల కొద్దీ వచ్చే దరఖాస్తులకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించే స్థితిలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.

రెండు రోజుల్లో ముగింపు!

జీహెచ్ఎంసీలో వరద బాధితుల సాయం కోసం రూ. 550 కోట్లు కేటాయించినా.. అంతకుమించి అందించినట్టు గణంకాలు చెబుతున్నాయి. వర్షాలు, వరదలతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో నేరుగా డబ్బులను పంచారు. సుమారు రూ.450 కోట్లను నేరుగా ప్రజల వద్దకు వెళ్లి రూ.10వేల చొప్పున అందజేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించగా 3.32 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు మీసేవా కేంద్ర కార్యాలయం తెలిపింది. మీసేవా దరఖాస్తుల్లో నవంబర్ నెల ముగిసే నాటికి రెండు లక్షల 60 వేల మందికి బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు జమ చేశారు. ఇక ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఇప్పటి వరకూ 59,416 వేల మందికి సాయమందించినట్టు అధికారులు ప్రకటించారు. మీసేవా దరఖాస్తులకు మాత్రమే చెల్లింపులు జరుపుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 3.19 లక్షల దరఖాస్తులకు వరద సాయం అందింది. అధికారిక గణంకాల ప్రకారం చూసినా.. కేవలం 13 వేల దరఖాస్తులు మాత్రమే ఉన్నట్లు తెలిపోతోంది. ప్రస్తుతం చెల్లింపుల సరళి ప్రకారం రోజుకు 10 వేల మందికి మాత్రమే సాయమందిస్తున్నారు. ఈ లెక్కన మిగిలిన దరఖాస్తులు పూర్తి కావాలంటే రెండు రోజులు పట్టనుంది. మీసేవాల్లోని దరఖాస్తుల చెల్లింపులు పూర్తయిన తర్వాత వరద సాయం చెల్లింపులు ఆగిపోవడమే తరువాయి. వరదసాయం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 7,19,416మందికి డబ్బులు అందించింది. ఇక కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం మొదలు పెడితే ఆ సంఖ్యను అంచనా వేసే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. దాదాపు 700కోట్లను ఇప్పటికే అందించిన ప్రభుత్వానికి మరిన్ని నిధులు సమకూర్చుకోవడం పెను సవాల్‌గా మారనుంది. మిగిలిన దరఖాస్తులకు కూడా డబ్బులు జమ చేసిన తర్వాత కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినా.. లేకపోయినా కొనసాగే అవకాశాలు లేవన్నది మాత్రం స్పష్టమే.

Next Story