జూన్ 8 నుంచి తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్

by  |
జూన్ 8 నుంచి తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్
X

రాష్ర్టంలో పదో తరగతి పరీక్షలు జరుపుకోవడానికి ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ జూ 8వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకూ నిర్వహించబోతున్నామని తెలిపారు. మార్చిలో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా నేపథ్యంలో రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో వాయిదా వేశామని అన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు ప్రస్తుతం 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బందిని కూడా వినియోగించుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాలకు అరకిలోమీటర్ దూరంలోనే నూతన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజూ పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు శానిటైజ్ చేయడంతో పాటు, మాస్కులు అందజేస్తామని తెలిపారు. థర్మల్ స్ర్కీనింగ్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోని అనుమతి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి బెంచిపై ఒక్కరే కూర్చోవాలని, పరీక్షా కేంద్రంలోకి గంట ముందే అనుమతి ఇస్తామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు సిద్ధంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed