- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే తొలిసారి.. రోబోలకు ఒలింపిక్ క్రీడలు
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఆధునిక యుగంలో రోబోలే రాజ్యమేలుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. రోజు రోజుకీ టెక్నాలజీ (Technology) కొత్త కొత్త కోణాల్లో అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రాకతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మనుషులను మాదిరిగా ఆలోచించే, పనిచేసే రోబోలు (Robots) వచ్చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం మనం రోబోల రాజ్యంలో జీవిస్తున్నామని చెప్పొచ్చు! అయితే, మనుషులైనా, మెషీన్లు అయినా పని మాత్రమే చేస్తూ ఉండటమంటే.. బోర్ కదా? మనలాగే, ఈ మర మనుషులకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనిపించిందేమో! అందుకే ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో రోబోల కోసం ప్రత్యేకంగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది టెక్నాలజీ తాలూకు కొత్త మలుపు.
చైనాలో (China) తొలిసారిగా వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్(The World Humanoid Robot Games) నిర్వహిస్తున్నారు. బీజింగ్‌లో ఆగస్టు 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీల్లో అమెరికా(USA), జర్మనీ, బ్రెజిల్, జపాన్ సహా 16 దేశాలకు చెందిన దాదాపు 280 జట్లు (192 విశ్వవిద్యాలయాలు, 88 ప్రైవేటు సంస్థలు ), 500కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు మొత్తం 26 క్రీడల్లో పాల్గొనున్నాయి. ఇక చైనా నుంచి యూనిట్రీ, ఫోరియర్ సంస్థలు దీనిలో పోటీ పడుతున్నాయి. బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్ (ఐస్ రిబ్బన్)లో జరిగే ఈ ఈవెంట్‌లో రన్నింగ్, ఫుట్‌బాల్, బాక్సింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, టేబుల్ టెన్నిస్‌తో పాటు హాస్పిటల్ డ్రగ్ సార్టింగ్, హోటల్ క్లీనింగ్ వంటి రియల్-వరల్డ్ టాస్క్‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ పోటీల్లో తొలిరోజు స్ప్రింట్ రన్నింగ్, సాకర్, బాక్సింగ్ పోటీలు జరిగాయి.
అయితే, ఈ పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, రోబోల సమన్వయం, నిర్ణయాధికారం, బ్యాలెన్స్‌ను పరీక్షించనున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఫ్యాక్టరీలు, గృహాల్లో వాటి వినియోగాన్ని మెరుగుపరిచే దిశగా అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో కీలకంగా మారనుంది. అంతేకాదు, చైనా పెద్ద మొత్తంలో నిధులతో హ్యూమనాయిడ్ రోబోట్ల రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం గతేడాది ఏఐ, రోబోటిక్స్ రంగం కోసం 20 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. అలాగే, భవిష్యత్తులో 137 బిలియన్ డాలర్లతో ఓ నిధిని ఏఐ, రోబోటిక్ స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ రోబోటిక్స్ ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొన్నాళ్ల క్రితమే హ్యూమనాయిడ్స్ కోసం తొలిసారి మారథాన్ రేసుకు బీజింగ్ వేదికగా నిర్వహించింది. అయితే, అందులో పాల్గొన్న చాలా రోబోలు పోటీ పూర్తికాకముందే దెబ్బతిన్నాయి.






